Nalgonda Mosambi: కలిసొచ్చిన ‘కత్తెర’.. రైతుల్లో ఆనందం!

Nalgonda Mosambi: Cheer For Sweet Orange Farmers in Nalgonda District - Sakshi

ఢిల్లీ మార్కెట్‌లో నల్లగొండ బత్తాయికి డిమాండ్‌

తోటల వద్దే టన్నుకు రూ.56 వేలు పలికిన ధర

  కనీసం ఒక లోడు కాయ ఉంటే టన్నుకు మరో రూ.10 వేలు అదనం

కత్తెర సీజన్‌లో రూ.156 కోట్ల వ్యాపారం

నల్లగొండ జిల్లాలో 42 వేలఎకరాల్లో కాపు

సుమారు 40 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా 

సాక్షి ప్రతినిధి నల్లగొండ: బత్తాయి రైతులకు ఈ సారి కాలం కలిసొచ్చింది. కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారికి విటమిన్‌–సీ అత్యంత అవసరమని డాక్టర్లు పదేపదే చెబుతున్న వేళ బత్తాయికి డిమాండ్‌ పెరిగింది. కోవిడ్‌ విజృంభణతో అల్లకల్లోలంగా మారిన ఢిల్లీలో నల్లగొండ బత్తాయికి గిరాకీ పెరిగింది. అక్కడ బత్తాయికి రిటైల్‌లో కిలో కనీసం రూ.200 ధర ఉండటంతో వ్యాపారులంతా ఇక్కడి బత్తాయి తోటలపై వాలిపోయారు.

కాయ సైజుతో సంబంధం లేకుండా.. చెట్టు మీద ఎంత పంట ఉంటే అంత కొనుగోలు చేస్తున్నారు. కత్తెర దిగుబడి తక్కువగా.. మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కరోనా ఉన్న ప్రధాన నగరాల్లో బత్తాయికి ఎక్కువగా డిమాండ్‌ ఉంది. గత ఏడాది కరోనా సమయంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉండి.. రవాణా ఆంక్షలతో టన్ను ధర రూ.10 వేలకే అమ్ముకున్న రైతులకు ఈసారి మాత్రం పంట పండింది.  

గరిష్ట ధర.. టన్నుకు రూ.60 వేలు.. 
సాధారణంగానే కత్తెర పంట దిగుబడి తక్కువగా వస్తుంది.. దీంతో ధర అధికంగా ఉంటుంది. కానీ, ఈసారీ దిగుబడి తక్కువగా ఉండటం.. కరోనా డిమాండ్‌ కలిసివచ్చింది. దీంతో టన్ను బత్తాయి గరిష్టంగా రూ.60 వేల దాకా పలుకుతోంది. జిల్లా లో 42,558 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఇందులో 31,917 ఎకరాల నుంచి బత్తాయి దిగుబడి వస్తోంది. ఇక, కత్తెర పంట దిగుబడి 40వేల టన్నుల దాకా వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా. సాధారణ రోజుల్లో టన్నుకు రూ.39వేల దాకా ధర ఉంటుందని అధికారులు అంచనా వేయగా.. అనూహ్యంగా టన్నుకు రూ.40వేల నుంచి రూ.60వేలు పలుకుతోంది. జిల్లా నుంచి మొత్తంగా రూ.156 కోట్ల బత్తాయి టర్నోవర్‌ జరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.  


తోట వద్దే రూ.52 వేలకు అమ్మిన..  
దళారులు టన్నుకు రూ.52వేల చొప్పున ధర చెల్లించి తోట వద్దే కొన్నరు. 8 ఎకరాల్లో బత్తాయి సాగు ఉండగా.. 6 టన్నుల కాతవచ్చింది. పూర్తిస్థాయిలో పూత, పిందె రాలేదు. టన్ను రూ.60వేలు చెబితే చివరికి రూ.52వేలకు అమ్ముడుపోయింది. గత ఏడాది కత్తెర దిగుబడి 7 టన్నులు రాగా.. రూ.10వేలకైనా కొనుగోలు కాలేదు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులుపడ్డం.  
– ఇంద్రసేనారెడ్డి, ముషంపల్లి 

రూ.6 లక్షల ఆదాయం  
బత్తాయి ధరలో ఇప్పటివరకు నాదే రికార్డు. తోట వద్దే టన్ను రూ.56 వేలకు అమ్మిన. ఆరు ఎకరాల్లో 11 టన్నుల కత్తెర దిగుబడి రాగా.. రూ.6 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 20 టన్నుల వరకు సీజన్‌ పంట ఉంది. సాధారణంగా బత్తాయితోట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి మొదలవుతుంది. మా తోటలో మూడో ఏడాది నుంచే కత్తెర కాపు కాస్తోంది. మూడో ఏడాదే 11 టన్నులు కత్తెర కాపు కాయడం రికార్డే.
 – చింతరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆరెగూడెం, గుర్రంపోడు మండలం   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top