
గతేడాది రూ.29 లక్షలు
రాయదుర్గం: హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీ గణేశ్ లడ్డూ వేలం పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఖమ్మం జిల్లా ఇల్లందు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ రూ.51,07,777 లకు పాడుకొని రికార్డును నెలకొల్పారు. గత ఏడాది మైహోమ్ భుజ లడ్డూను ఆయనే రూ.29 లక్షలకు పాడారు. అది ఈ ఏడాది రూ. 51 లక్షలు దాటడం విశేషం. పోటాపోటీగా గణేష్, శ్రీకాంత్ ఇద్దరూ వేలంపాటలో కొనసాగుతూ అందరినీ ఉత్కంఠకు గురిచేశారు.
భక్తి, సెంటిమెంట్ వల్లే వేలంలో పాల్గొన్నా..
‘గణేశుడిపై ఉండే భక్తి, సెంటిమెంట్ వల్లే వేలం పాటలో పాల్గొన్నాను’అని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లందు గణేశ్ తెలిపారు. ‘మొదటిసారిగా రూ.29 లక్షలకు లడ్డూను గెలుచుకోగా నాకు వ్యాపారపరంగా ఎంతో లాభించింది. అందుకే సెంటిమెంట్‌తో ఈసారి మళ్ళీ వేలంపాటలో పాల్గొన్నాను. 25 ఏళ్ళుగా లడ్డూ వేలంపాటలో పాల్గొంటున్నా. ఇల్లందు స్టేషన్‌బస్తీలో వినాయక ఆలయాన్ని కట్టించాం. మా నాన్న, అమ్మ 20 ఏళ్ళుగా గణేశ్ మాల ధరిస్తున్నారు. మైహోం భుజ కమిటీ వారు పారదర్శకంగా ఈ లడ్డూ వేలం నిర్వహించడం సంతోషంగా ఉంది’అని అన్నారు.