‘మతి’తప్పుతోంది! దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే పరేషాన్‌లో ఉంది..

Mental Health Issues Increasing In Telangana - Sakshi

రోజురోజుకు పెరిగిపోతున్న మానసిక సమస్యల బాధితులు 

ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఏదో ఒక మానసిక సమస్య 

భయం, ఒంటరితనం, డిప్రెషన్, యాంగ్జైటీలతో ఇబ్బందులు 

కోవిడ్‌ మొదలైన నాటి నుంచి మరింత తీవ్రంగా పరిస్థితి 

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వాలు 

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల్లోనే వెల్లడి 

కంచర్ల యాదగిరిరెడ్డి
మీకేమైనా మెంటలా? అని ఎవరైనా అన్నారంటే.. ఒంటికాలిపై లేస్తాం.. చెడామడా తిట్టేస్తాం.. కానీ ఈ భూమ్మీద ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు తెలుసా? భయం, ఒంటరితనం, మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటివన్నీ మానసిక సమస్యలేనని.. తగిన చికిత్స, సాయం అందకపోతే ఇవి శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఎందరికి తెలుసు? మానసిక సమస్యల సంక్షోభం కొత్తేమీకాదుగానీ.. కోవిడ్‌ మహమ్మారి పుణ్యమా అని ఇది మరింత జటిలమైపోయింది! నిమి­షానికో ఆత్మహత్య, మత్తుమందుల విచ్చలవిడి వాడకంతో లక్షల మంది ప్రాణాలను బలిగొం­టున్న మానసిక సమస్యల మహాభూతంపై సమగ్ర కథనాలు మీకోసం.. 

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇదో పాత సినిమా డైలాగ్‌. కానీ మానసిక సమస్యల విషయానికొస్తే దేశం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరువవుతున్న ఈ తరుణంలో అందులో వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి.

అంతేకాదు బాధితుల్లో ఎక్కువ మంది పేదదేశాలకు చెందిన వారే కావడం.. వీరిలో 75 శాతం మంది తమ జీవితకాలంలో దీనికి చికిత్స పొందలేని పరిస్థితి ఉండటం గమనార్హం. మానసిక సమస్యల్లో సగం మేర లేత వయసులోనే మనిషిని చుట్టేస్తాయని, స్పష్టంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ల వయసు నుంచే ఈ సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆ ఘర్షణ ప్రభావం ఎందరు పసిమనసులపై పడి ఉంటుందో ఊహించుకోవచ్చు. 

మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకునేదెవరు? 
భూమ్మీద ఇలాంటి ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, మరికొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా 16 కోట్ల మందికిపైగా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి మానవతా సాయం అందాల్సిన అవసరముందని ఒక అంచనా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యల బారినపడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కోవిడ్‌ మహమ్మారి కారణంగా దాదాపు 93శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యం కోసం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి.

వాస్తవానికి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాలు చాలా తక్కువ. ఆరోగ్య బడ్జెట్‌లో రెండు శాతానికి మించి నిధులు ఈ విభాగంపై ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా రానున్న పదేళ్లలో కేవలం కుంగుబాటు (డిప్రెషన్‌) అనే మానసిక సమస్యను పరిష్కరించేందుకే బోలెడంత వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. 

మానసిక సమస్య అంటే? 
మనలో చాలా మందికి అసలు మానసిక సమస్య అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు. బాధపడటం కూడా మానసిక సమస్యేనా? అని కుంగుబాటు, ఆందోళన వంటివాటిని తేలిక చేస్తూంటారు. దీనివల్ల చికిత్సగానీ, మాట సాయం అవసరమనిగానీ గుర్తించని పరిస్థితి నెలకొంటుంది. మానసిక సమస్య అంటే ఏమిటనేది సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు వస్తే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి.

మన మానసిక ఆరోగ్యం దైనందిన జీవితం, ఇతరులతో మన సంబంధాలను మాత్రమేకాదు భౌతిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేయగలదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. మన దైనందిన జీవితం, ఇతరులతో సంబంధాలు, శరీరక సమస్యలు కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు, మంచి ఆహారం, మంచి జీవనశైలి ద్వారా మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నించినట్టే.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

ఎవరూ అతీతులు కారు! 
మానసిక సమస్యల్లో బోలెడన్ని రకాలున్నాయి. అవి ఫలానా వారికే వస్తాయి. కొందరికి రానే రావు అన్న వెసులుబాటు ఏమీ ఉండదు. వయసు, స్త్రీపురుషులు, ఆదాయం, జాతి వంటి వాటన్నింటికి అతీతంగా ఎవరికైనా మానసిక సమస్యలు రావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు వంటివన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయాలు. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయి. 

మానసిక సమస్యల లెక్క ఇదీ..
►35 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య 
►8,00,000.. ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపు 
►20,63,52,50,00,00,000 రూపాయలు.. మానసిక సమస్యల కారణంగా ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం(ఉత్పాదకత తగ్గడం, అనారోగ్యం వంటి కారణాలతో..)  
►రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువగా మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం చెబుతోంది. 
►మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువ!   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top