తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు

సాక్షి ప్రతినిధి మంచిర్యాల: పెద్దపులులు తోడు కోసం ఆరాటపడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడ తిండి, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తున్నాయి. శీతాకాలంలో మరింత ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఏటా నవంబర్‌లో ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తున్నాయి.
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మాసంలో ఏ2 అనే మగపులి మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో సంచరించింది. కవ్వాల్ నుంచి కాగజ్‌నగర్ వరకు తిరిగింది. రెండుచోట్లా ఆవాసం, తోడు కోసం ఆధిపత్య పోరు జరిపింది. చివరకు ఓపెన్ కాస్టులు, పత్తి చేలలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరిపై దాడి చేసి చంపేసింది. తాజాగా మూడున్నర ఏళ్లున్న మరో మగపులి ఈ నెల 15న ఒకరిపై దాడి చేసింది. ఈ పులి ఆవాసం, తోడు కోసం సంచరిస్తోంది. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం పది కిలోమీటర్లకు పైగా తిరుగుతోంది. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నవంబర్ నుంచి జనవరి వరకు..
పులులు ఏడాది పొడవునా జత కట్టగలవు. అయితే చలి గుప్పే మాసాలైన నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కువగా ఇష్టపడతాయి. మగవి ఆడపులులను వెతుక్కుంటాయి. ఆడ పులి 10 నుంచి 30కి.మీ. పరిధిలోనే ఉండిపోతే మగపులి 100 నుంచి 150కి.మీ. తిరగగలదు. ఒక్కో మగపులి రెండు, మూడు ఆడపులులతో సహవాసం చేయగలదు.
అయితే కొత్తగా వచ్చే మగపులులకు అప్పటికే అక్కడున్న పులుల మధ్య తోడు కోసం ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాటిని ఆ ప్రాంతం నుంచి తరిమేస్తే మరో ప్రాంతానికి వెళ్తుంటాయి. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర, తెలంగాణలో మొత్తం 3వేల కి.మీ. తిరిగి ’వాకర్’ అనే మగపులి రికార్డు సృష్టించింది. పులి మెడకు అక్కడి అధికారులు రేడియో కాలర్ అమర్చడంతో తోడు కోసమే తిరిగినట్లు గుర్తించారు. అప్పట్లో మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో జే1 మగపులికి కవ్వాల్ కోర్ ప్రాంతంలో ఆవాసం, రక్షణకు ఇబ్బంది లేదు.
అడవి దాటి
ఉమ్మడి ఆదిలాబాద్ అడవులు అనేక పులులకు అవాసం ఇవ్వగలవు. అయితే పులులకు ఎలాంటి అలజడి లేని అన్ని రకాల అనుకూలమైన ఆవాసాలు ఉంటేనే కొన్నాళ్లు ఉంటాయి. కాగజ్‌నగర్ డివిజన్‌లో ‘సూపర్ మామ్’గా పిలిచే పాల్గుణ రెండు దశల్లో 9 పిల్లల్ని, మళ్లీ వాటి పిల్లలు(కే1 నుంచి కే9) కూడా జన్మనిచ్చాయి. ఇవేకాకుండా ‘ఎస్’ సిరీస్ పులులు ఇక్కడే జత కట్టాయి. ఇవి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. రెండు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి ‘పీ1’ అనే మగపులి కాగజ్‌నగర్ డివిజన్‌లోని ‘కే8’తో జతకట్టింది. ఇది ఏడాదిన్నర క్రితమే తన మూడు పిల్లల నుంచి విడిపోయింది.
ఇక ‘ఎస్6’ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అటవీ శాఖ అధికారులు కొత్త పులి ఉందని సమాచారం రాగానే కెమెరాలు అమర్చి వాటి కదలికలు పర్యవేక్షిస్తుంటారు. పశువుల వేట, ప్రవర్తన, ఆ పులికి తోడు ఉందా లేదా తెలుసుకుంటూ రిజర్వు ఫారెస్టులో స్థిరపడేలా చేయాలి. అయితే కవ్వాల్ కోర్ ప్రాంతంలో పులుల జీవనం సాగితే అటు అటవీ అధికారులకు, ఇటు స్థానికులకు సమస్యలు ఉండకపోయేవి. కానీ కోర్ ఆవల బఫర్ జోన్‌లో ఇంకా చెప్పాలంటే పులుల కారిడార్‌గా పిలిచే ప్రాంతాల్లో సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారిడార్‌లో పత్తి చేలు ఉన్నాయి.
చదవండి: హస్తంలో అన్ని వేళ్లు ఒకేలా ఉంటాయా.. కాంగ్రెస్‌లో కూడా అంతే సుమీ..