ట్రిపుల్‌ ఆర్‌...ఇక జస్ట్‌ హైవేనే! | A magnificent expressway design is soon transformed into an ordinary national highway | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఆర్‌...ఇక జస్ట్‌ హైవేనే!

Mar 22 2026 5:27 AM | Updated on Mar 22 2026 5:27 AM

A magnificent expressway design is soon transformed into an ordinary national highway

అద్భుత ఎక్స్‌ప్రెస్‌ వే డిజైన్‌ కాస్తా సాధారణ జాతీయ రహదారిగా మార్పు 

భారీ వ్యయానికి జడిసి ప్రత్యేకతలన్నీ తొలగిస్తున్న కేంద్రం

ఓఆర్‌ఆర్‌ను మించి నిర్మితమవుతుందనుకుంటే.. అంచనాలన్నీ తల్లకిందులు 

ఇప్పటికే 8 వరుసలకు బదులు6 వరుసలకు కుదింపు, సర్వీ స్‌ రోడ్డు స్థానంలో యాక్సెస్‌ పాత్‌ 

తాజాగా ఎక్స్‌ప్రెస్‌ వే హోదా తొలగింపు.. వేగ పరిమితి 120 కి.మీ. నుంచి 100 కి.మీ.లోపునకు తగ్గింపు 

ఒక్క ఉత్తర భాగంలోనే మొత్తం వంతెనలు 204 నుంచిసగానికి తగ్గిపోనున్న వైనం 

సర్వీస్‌ రోడ్డు కాదు కదా కనీసంకచ్చా రోడ్డు కూడా లేకుండా డిజైన్‌ మార్పు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను మించిన అద్భుత ఎక్స్‌ప్రెస్‌ వేగా రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) రాబోతోంది, అది తెలంగాణకు గేమ్‌ ఛేంజర్‌ కాబోతోంది..’అంటూ ఊరించిన కేంద్రం చివరకు ఉసూరుమనిపించింది. ఓఆర్‌ఆర్‌తో పోలిస్తే ట్రిపుల్‌ ఆర్‌ దిగదుడుపుగానే ఉండనుంది. నిర్మాణ వ్యయానికి జడిసి ఇప్పుడు ట్రిపుల్‌ ఆర్‌ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతో సరిపెట్టుకుని నిర్మించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే దానికి ఎక్స్‌ప్రెస్‌వే హోదా ఉండదు. ఫలితంగా ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణానికి ముందే చాలా ప్రత్యేకతలను కోల్పోయింది. 

ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణ వ్యయం ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు రూ.38 వేల కోట్లను మించేలా ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించటం సరికాదని తేల్చిన అధికారులు, వీలైనంత మేర నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని గత రెండు నెలలుగా ఢిల్లీలో కసరత్తు చేపట్టారు. విడతల వారీగా ప్రత్యేకతలు తగ్గిస్తూ, బడ్జెట్‌లో కోత పెడుతూ అంచనా వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 8 వరుసలకు బదులు 6 వరుసలకు కుదించారు. సర్వీసు రోడ్డు స్థానంలో సాధారణ యాక్సెస్‌ పాత్‌ తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని కూడా తొలగించారు. 

స్ట్రీట్‌ లైటింగ్‌ను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. అండర్‌ పాస్‌ల సంఖ్యను సగానికి తగ్గించేశారు. తాజాగా మరోసారి సమీక్షించిన అధికారులు ఇప్పుడు ఏకంగా ఎక్స్‌ప్రెస్‌వే హోదా తొలగించేశారు. దీంతో ట్రిపుల్‌ ఆర్‌ మరిన్ని ప్రత్యేకతలు కోల్పోనుంది. ఓఆర్‌ఆర్‌ ముందు వెలవెల పోనుంది. ఓఆర్‌ఆర్‌ మీద వాహనాలు గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తుండగా, ట్రిపుల్‌ ఆర్‌పై వేగం 100 ఉండనుంది. మొత్తం మీద ఈ కోతల వల్ల అంచనా వ్యయం 25 శాతం మేర తగ్గుతుందని భావిస్తున్నారు.

ట్రిపుల్‌ ఆర్‌ ప్రతిపాదనలు తొలుత ఎలా... ఇప్పుడెలా?
తొలుత: దేశంలోనే తొలి అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే రింగురోడ్డు. దాదాపు 362 కి.మీ. నిడివితో ఓ నగరానికి రింగు రోడ్డుగా ఉండటం దేశ రోడ్‌ నెట్‌వర్క్‌లో ఓ రికార్డు.  

ఇప్పుడు: నిడివిలో మార్పు లేనప్పటికీ, ఎక్స్‌ప్రెస్‌ వేకు ఉండే ప్రత్యేకతల్లో భారీగా కోత పెట్టి సాధారణ హైవేగా మార్చేశారు.  

తొలుత: దేశంలోనే 8 లేన్లతో కూడిన అతి పొడవైన రింగురోడ్డుగా దీన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్‌ ఔటర్‌ కూడా 8 వరుసలతో ఉండగా, దానికి రెట్టింపు నిడివితో ట్రిపుల్‌ ఆర్‌ను ప్రతిపాదించారు.  

ఇప్పుడు: 8 వరుసల ఆలోచనను విరమించుకున్నారు. మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్‌కు 6 వరుసలు సరిపోతాయని, 8 వరుసలు వృథా వ్యయమంటూ 6 వరుసలకు కుదించేశారు. 

తొలుత: సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌వే/జాతీయ రహదారులపై పట్టణాలు, గ్రామాలు ఉన్న చోటనే లైటింగ్‌ వ్యవస్థ ఉంటుంది. కానీ హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పొడవునా దీపాలు ఏర్పాటు చేసిన తరహాలోనే ట్రిపుల్‌ ఆర్‌ పొడవునా ఎల్‌ఈడీ స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థ ప్రతిపాదించారు.  

ఇప్పుడు: అంత నిడివితో ఎల్‌ఈడీ స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కేవలం జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తొలుత: 162 కి.మీ. నిడివితో ఉత్తర భాగంలోనే మొత్తం 204 వంతెనలు నిర్మించాలని భావించారు. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్‌ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్‌ఛేంజ్‌ వంతెనలు, మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరా నది మీద పుల్కల్‌ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రానది మీద తూప్రాన్‌ వద్ద 3 పెద్ద వంతెనలు, వాగులు వంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాల్వలు, నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులు ప్రతిపాదించారు. 

ఇప్పుడు: వంతెనల వ్యయం భారీగా ఉండటంతో పొదుపు చర్యలు ప్రధానంగా ఇక్కడే చేపట్టారు. వంతెనల సంఖ్యను సగానికి సగం కుదించనున్నారు. దీంతో కొన్ని చిన్న దారుల వద్ద రోడ్డును దాటే వీలుండదు. ముందుకో, వెనక్కో వెళ్లి యూ టర్న్‌ తీసుకుకోవాల్సి ఉంటుంది.  

తొలుత: ఓఆర్‌ఆర్‌ తరహాలో ట్రిపుల్‌ ఆర్‌కు కూడా సర్వీసు రోడ్డును ప్రతిపాదించారు. తర్వాత ఆ ఆలోచన విరమించుకుని సాధారణ యాక్సెస్‌ పాత్‌ను ఖాయం చేశారు. అంటే ఫుట్‌పాత్‌ లాంటివి లేని ఓ కచ్చా రోడ్డు అన్నమాట.  

ఇప్పుడు: కచ్చా రోడ్డుతో కూడిన యాక్సెస్‌ పాత్‌ను సైతం విరమించుకున్నారు. పెద్ద చెరువు కట్ట తరహాలో ఉండే ఈ ప్రధాన క్యారేజ్‌ వే దిగువన ఎలాంటి రోడ్డు ఉండదు. వట్టి ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. దానిపైనే వాహనాలు రాకపోకలు సాగించాలి.  

తొలుత: 8 వరసల రోడ్డు, ఎక్స్‌ప్రెస్‌ ప్రమాణాలతో నిర్మాణం, వాహనాల వేగ పరిమితి 120 కి.మీ.కుపైగా అయినందున రోడ్డు ఎంబ్యాంక్‌మెంట్‌(రోడ్డు కట్ట) 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించేలా డిజైన్‌ చేశారు. అప్పుడు రోడ్డు ఉపరితలంలో నిలువు వాలు 1,300 మీటర్ల ముందే ప్రారంభం అయ్యేలా నిర్మించేందుకు వీలవుతుంది.  

ఇప్పుడు: సాధారణ ఎన్‌హెచ్‌ ప్రమాణాలతో నిర్మిస్తున్నందున రోడ్డు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది.

తొలుత: వాహనాలు గంటకు 160 కి.మీ. మించిన వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేని విధంగా డిజైన్‌ ప్రతిపాదించారు. అధికారిక వేగ పరిమితిని 120 కి.మీ.గా పేర్కొన్నారు. రోడ్డు నిలువు వాలు (వర్టికల్‌ కర్వ్‌) 1300 మీటర్లు ఉండేలా డిజైన్‌ చేశారు. అంటే ఒక మీటర్‌ మేర రోడ్డు పల్లం (డీప్‌) కావాలంటే 1300 మీటర్ల నుంచే ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుందన్న మాట. (వాలు మొదలు అవుతుంది) దీంతో 600 మీటర్ల ముందు వరకు రోడ్డు విజిబిలిటీ ఉంటుంది. అంత దూరంలో పిల్లి సైజు జంతువు రోడ్డు దాటుతున్నా కనిపిస్తుంది. ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. 

ఇప్పుడు: గరిష్ట వేగం 100కు కుదించారు. రోడ్డు నిలువు వాలు 650 మీటర్లకు పరిమితం చేశారు. అంటే ఎత్తు, పల్లంల వద్ద వాహనాల గరిష్ట విజిబిలిటీ దూరం కవలం 360 మీటర్లు మాత్రమే ఉంటుంది. వాహనాలు ఒకవేళ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement