Alert: రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!

Late Night Sleep May Lead To Diabetes Depression Follow These Tips - Sakshi

కోవిడ్, లాక్‌డౌన్‌తో మారిన జీవన విధానం

జీవ గడియారంలో పెను మార్పులు ∙శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 

దీర్ఘ కాలిక జబ్బులు పడే అవకాశం ∙హెచ్చరిస్తున్న మానసిక, వైద్య నిపుణలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ తదితర కారణాల వల్ల ఏడాదిన్నర కాలం నుంచి వారి జీవన విధానాల్లో మార్పులు సంభవించాయి. దీంతో సరిగ్గా నిద్ర పోవట్లేదు. గతేడాది సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధింపుతో మొదలైన సంప్రదాయ విరుద్ధ ఆహారం, నిద్ర, ఇతర అలవాట్లు శరీరంపై అనేక రూపాల్లో ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్‌ ముందు నుంచీ ఇలాంటి జీవన విధానం అవలంబించిన వారున్నా.. ఇప్పుడు వారి సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నారు. తాజాగా ఈ కోవలోకి యువత, స్కూల్, కాలేజీ పిల్లలు, ఇతర వర్గాల ఉద్యోగులు, ప్రజలు వచ్చి చేరారు.

రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర పోవడం, మధ్యాహ్నం లేవడం వల్ల మన ‘జీవ గడియారం’లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు, మానసిక నిపుణులు చెబుతున్నారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లోని నార్త్‌ వెస్ట్రన్, సర్రే యూనివర్సిటీలు ఇటీవల జరిపిన పరిశీలన ప్రకారం.. రాత్రిళ్లు ఎక్కువ సమయం మెలకువ ఉండే వారిలో దీర్ఘకాలిక మధుమేహం, మానసిక సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు, ఉదర కోశ, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయని వెల్లడైంది. 

నిద్రలేమి, సంబంధిత ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై సైకాలజిస్ట్‌ సి.వీరేందర్, సైకియాట్రిస్ట్‌ డా.నిషాంత్‌ వేమన వెలిబుచ్చిన అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. కారణాలు– జాగ్రత్తలు..

  • అధిక బరువు, ఊబకాయమున్న వారిలో నిద్రలేమి ఎక్కువగా ఉండే అవకాశం. 
  • లాక్‌డౌన్‌లో అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడంతో బరువు పెరుగుదల నిద్రలేమికి కారణం కావొచ్చు. 
  • సరిగ్గా నిద్రపోని కారణంగా రోజంతా చురుగ్గా లేకపోవడం, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. నిరాసక్తంగా ఉంటారు. 
  • దీన్ని అధిగమించేందుకు మితమైన ఆహారంతోపాటు ప్రాణాయామం, యోగా, తేలికపాటి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. 
  • 30–60 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. 
  • నిద్రలేక ఆక్సిజన్‌ శాతం తగ్గినా, శ్వాస సరిగ్గా ఆడకపోయినా ఇబ్బందులొస్తాయి. 
  • నిద్ర లేమితో మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడంతో ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు. 
  • ఈ కారణంగా ఏర్పడే మైక్రో అరొజల్స్‌ వల్ల గాఢ నిద్రలోకి వెళ్లినా కూడా నిద్ర పోయినట్లే అనిపించదు. 
  • రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం లేదా వేళాపాళా లేకుండా ఏ అర్ధరాత్రి దాటాకో నిద్రపోతే ఉదయం ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. 
  • పగటిపూట నిద్ర ఆపుకొనేందుకు ఎక్కువగా సిగరెట్లు, కాఫీ, టీలు తాగడం కూడా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. 
  • నిద్రపోవడానికి 2 గంటల ముందు వరకు మొబైళ్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలు ఉపయోగించొద్దు. 
  • సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయం తగ్గించాలి. 
  • మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం, పాటలు, ఇతర అభిరుచుల్లో నిమగ్నం కావాలి.  

శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది
శరీర సహజ సిద్ధమైన వ్యవస్థ, జీవ గడియారానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల జీవన ప్రక్రియలపై ఒత్తిడి పెరిగి రోగనిరోధకత ప్రభావితం అవుతుంది. దీంతో అర్ధరాత్రి దాటాక నిద్ర పోయి.. మధ్యాహ్నం సమయంలో నిద్ర లేచిన వారి శరీరాల్లో విషపూరిత రసాయనాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే పద్ధతిని దీర్ఘకాలం కొనసాగిస్తే జీవన ప్రక్రియలపై ప్రభావం చూపడమే కాకుండా మతిమరుపు, గుర్తుకు పెట్టుకునే తత్వం కోల్పోవడం, గుండెపోటు వంటి వాటి బారిన పడతారని వివిధ పరిశోధనల్లో గతంలోనే నిరూపితమైంది. ఇలా వేళ కాని వేళల్లో నిద్రించే విధానాల వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.

మారిన అలవాట్లు, నిద్ర సమయాలకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు మన శరీరం అదనంగా శ్రమించాల్సి వస్తుంది. మెదడులో నిద్రకు ఉపక్రమించేలా చేసేందుకు ఉత్పత్తి అయ్యే ‘మెలటోనిన్‌’అనే హార్మోన్‌ విడుదలలో కాస్త అయోమయం ఏర్పడుతుంది. దీంతో అది పూర్తిగా విఫలమై తీవ్ర భావోద్వేగాలకు గురి కావడం, ఆదుర్దా, ఆందోళన చెందడం జరుగుతుంది. మెలటోనిన్‌ హార్మోన్‌ను మెదడులోని పీనియల్‌ గ్రంథి విడుదల చేస్తుంది. చీకటి సమయాల్లో ఇది విడుదలై నిద్ర పోయేందుకు దోహదపడుతుంది. వెలుతురు ఉన్నప్పుడు విడుదల ఆగిపోయి మెలుకునేలా ఉంటుంది.       – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌ 

ఆందోళన, డిప్రెషన్‌ పెరుగుతుంది
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు బాగా పొద్దుపోయాక నిద్ర లేవడం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల వివిధ పనులు చేసుకునే వారి ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. సరైన సమయంలో నిద్రపోతేనే మనలో ఏకాగ్రత పెరగడమే కాకుండా, జ్ఞాపకశక్తి, ధ్యాస సరిగా ఉండటంతో పాటు త్వరగా అలసిపోకుండా ఉంటాం. మేం ఇప్పటివరకు పరిశీలించిన కేసుల ప్రకారం.. సరైన సమయానికి నిద్రపోక పోవడం, నిద్రలేమి కారణంగా ఆందోళన, డిప్రెషన్, కోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

దాదాపు ఏడాదిన్నరగా కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిణామాలు, పరిస్థితుల కారణంగా యుక్త వయసు పిల్లలు, యువతరం రాత్రుళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోవడం కారణంగా మరునాడు ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల మొక్కుబడిగా ల్యాప్‌టాప్‌.. ట్యాబ్, ఫోన్‌ ఆన్‌ చేసి మళ్లీ నిద్రలోకి జారుకోవడం లేదా చెప్పే పాఠాలపై దృష్టి పెట్టకపోవడం చేస్తున్నారు. రాత్రి సరైన నిద్రలేకపోవడంతో సమయానికి తిండి తినకపోవడం వల్ల ఉదర సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
– డా. నిషాంత్‌ వేమన, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, సన్‌షైన్‌ ఆస్పత్రి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top