అక్రమ నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణకు తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు
జలవిద్యుదుత్పత్తి చేయకుండా ఏపీని అడ్డుకోవాలన్న తెలంగాణ వినతిపై సమాధానం
2015 నాటి భేటీ నిర్ణయాల మేరకు సామరస్యంగా తగవులు తీర్చుకోవాలని ఇరు రాష్ట్రాలకు సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల నిర్వహణను తమ పరిధి కిందకు తీసుకొచ్చినా అక్రమంగా నీటిని వినియోగించుకునే రాష్ట్రాన్ని దండించే (పీనల్ యాక్షన్) అధికారం తమకు లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తేల్చిచెప్పింది. కేవలం కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో చర్యలు తీసుకోగలదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్సీలకు ఈ నెల 8న కృష్ణా బోర్డు సంచలన లేఖ రాసింది.
ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటి తరలింపుతోపాటు ఇతర సంబంధిత అంశాలను పరస్పర సహకారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని లేఖలో పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు లోబడి నడుచుకోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏపీ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాన్ని ఖాళీ చేస్తోందని తెలంగాణ ఇటీవల చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ కృష్ణా బోర్డు ప్రత్యుత్తరం రాసింది.
ఏపీ ఇప్పటికే వాటాకు మించి 125 టీఎంసీలను వాడుకుందని.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస నిల్వ మట్టానికి ఎగువన మిగిలి ఉన్న 80 టీఎంసీల నిల్వలు పూర్తిగా తమ రాష్ట్ర వాటా హక్కులేనని స్పష్టం చేసింది. ఈ నీటిని వాడుకోకుండా ఏపీని నియంత్రించాలని, ఏపీ జలవిద్యుదుత్పత్తి జరపకుండా కట్టడి చేయాలని అందులో కోరింది. అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని బోర్డు బదులిచ్చింది. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు తీర్చడం తమ వల్ల కాదంటూ మార్చి 30న ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు గుర్తుచేసింది.
పలు అంశాలు పెండింగ్‌లో ఉండటంతో..
ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కృష్ణా ట్రిబ్యునల్–2 పునః కేటాయింపులు జరపాల్సి ఉంది. దీనికి తోడు ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్స్‌ను ట్రిబ్యునల్ ఖరారు చేయాల్సి ఉంది. ఏపీ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు ఇరు రాష్ట్రాలు అప్పగించాల్సి ఉంది.
ఈ విషయాలేవీ తేలకపోవడంతో ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల జోలికి వెళ్లడం తమకు సాధ్యం కాదని బోర్డు స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి శాఖ 2015 జూన్ 18, 19న ఏపీ, తెలంగాణతో నిర్వహించిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపకాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాలతోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని నిబంధనలను అనుసరిస్తూ ఇరు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని బోర్డు సూచించడం గమనార్హం.
కల్వకుర్తికి అనుమతులు తీసుకోవాలి..
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన నిబంధనలను గౌరవించడంలో భాగంగా అను మతుల్లేని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తి పోతల పథకానికి అనుమతులు పొందాలని తెలంగాణకు కృష్ణా బోర్డు సూచించింది. ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ముందుకెళ్లాలని సూచించింది.


