ఎంపీలు చూస్తే అలా.. సీఎం కేసీఆరేమో ఇలా: కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy Letter To CM KCR On Construction Of Airports In Telangana - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ (ఎయిర్ వేస్) అనుసంధానత కోసం అవసరమైన డెవలప్‌మెంట్ చేసి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. సాంకేతిక, భూపరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి (నిజామాబాద్), వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలంటూ లేఖలో కేసీఆర్‌ను కోరారు. 

ఈ క్రమంలోనే సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందని.. దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులున్నాయి. మూడు విమానాశ్రయాల (ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్) నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ పలుమార్లు లేఖలు రాసినా, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా కేసీఆర్‌కు లేఖ రాసినా స్పందన రాలేదన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి లేఖకు కొనసాగింపుగా.. ఈ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలంటూ.. తాను స్వయంగా కేసీఆర్‌కు 30 జూలై, 2022న లేఖ రాశానన్నారు. దీనికి కూడా సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి తెలిపారు. 

గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవకరద్ర (మహబూబ్ నగర్), మమ్నూరు (వరంగల్), బసంత్ నగర్  (పెద్దపల్లి), ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపిందని.. అయితే AAI చేపట్టిన OLS సర్వే, సాయిల్ టెస్టింగ్ (భూపరీక్ష), టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS) చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని కిషన్ రెడ్డి లేఖలో గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ఇమ్మని అడిగితే ఎటువంటి స్పందన రాకపోగా.. ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి ఆగ్రహం ‍వ్యక్తం చేశారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 140 దాటడం, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పనిచేస్తున్నదని కిషన్‌రెడ్డి అన్నారు. విమానయాన రంగంలో ఉన్నటువంటి ఈ సానుకూలమైన  వాతావరణాన్ని సద్వినియోగ పరచుకుని.. తెలంగాణలో కూడా విమానాశ్రయాల పెంపుపై ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు. ఈ దిశగా సంపూర్ణ సహకారానికి పౌర విమానయాన శాఖ ఇదివరకే సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని  ఈ లేఖ ద్వారా మరోసారి గుర్తుచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top