ఒమిక్రాన్‌ మళ్లీ రాదనుకోవద్దు!

Kims Medical Experts Says Do Not Want OmiCron To Come Again  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్‌ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్‌ డిపార్డర్స్‌ స్పెషలిస్ట్‌ డా. వీవీ రమణప్రసాద్‌ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్‌ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్‌ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

ఒమిక్రాన్‌ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా?
ఒకసారి ఒమిక్రాన్‌ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్‌ సోకి నెగెటివ్‌ వచ్చాక బయట తిరిగి వైరస్‌కు మళ్లీ ఎక్స్‌పోజ్‌ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్‌ రీ ఇన్ఫెక్షన్‌ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. 

రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి?
కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్‌ రెస్పిరేటరీ సిస్టమ్‌’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్‌ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్‌ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు?
ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్‌ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్‌’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. 

లాంగ్‌ కోవిడ్‌ సమస్యలుంటున్నాయా?
అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్‌ తీసుకున్న వారికి సంబంధించి వైరస్‌ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్‌ షాడోస్‌’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top