రబీ ధాన్యమంతా కేంద్రం సేకరించాలి.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

KCR Writes Letter To PM MODI On Paddy Procurement - Sakshi

దేశమంతా ఒకే సేకరణ విధానం ఉండాలి 

నిపుణులు, సీఎంలతో కలిసి చర్చించి జాతీయ విధానం ప్రకటించాలి 

ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత కేంద్రానిదేనన్న సీఎం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు రబీ (యాసంగి) సీజన్‌లో పండించి విక్రయించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించేలా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పంటను సేకరించకపోతే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు అర్థమే లేదన్నారు. ఇది వ్యవసాయ రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రధానికి సీఎం లేఖ రాశారు. పంజాబ్, హరియాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం, గోధుమలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లో భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.  దేశంలోని వివిధ రాష్ట్రాలకు విభిన్నమైన విధానాలు ఉండకూడదన్నారు. జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల సేకరణకు ఒకే విధానం ఉండాలని.. నిపుణులు, సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ సేకరణ విధానాన్ని రూపొందించాలని ప్రధానికి సూచించారు. లేఖలో కేసీఆర్‌ ఏమేం ప్రస్తావించారంటే.. 

ఆహార భద్రత చట్టం లక్ష్యానికి విఘాతం 
రాష్ట్రాల ప్రజా పంపిణీ అవసరాలను తీర్చిన తర్వా త కేంద్రమే మొత్తం ధాన్యాన్ని సేకరించాలనేది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందం. తెలంగాణలో ఏ ధాన్యం అందుబాటులో ఉందో దాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. గతంలో ఇదే ఆనవాయితీగా ఉన్నా ఆహార శాఖ రెండేళ్లుగా వరి ధాన్యాన్ని సేకరించేందుకు విముఖత చూపుతోంది. ఇది ఆహార భద్రత చట్టం లక్ష్యా న్ని ఉల్లంఘించడమే. ఈ చట్టం అమలు బాధ్యత మీదే. రాష్ట్ర ప్రభుత్వాలకు నిల్వ సామర్థ్యం, ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర తరలింపు అవకాశాల్లేవు. కాబట్టి ఆహార ధాన్యాలను సేకరించి సరఫరా చేసే బాధ్యతను ఈ చట్టం కేంద్రానికి ఇచ్చింది.  

తెలంగాణలో ప్రగతిశీల విధానాలు 
దేశంలో సగం జనాభా వ్యవసాయాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో వ్యవసాయ రంగంలో స్థిరమైన అధిక వృద్ధి రేటును సాధించడానికి మేం ప్రగతిశీల, రైతు అనుకూల విధానాలను అనుసరించాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయల కల్పన వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు గణనీయంగా తగ్గాయి.  

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాం 
పంటల మార్పిడి అవసరాన్ని గుర్తించి వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఆయిల్‌ పామ్, ఎర్రపప్పు తదితర పంటల సాగును ప్రోత్సహించాం. తద్వారా వరి సాగు 52 లక్షల ఎకరాల నుంచి 36 లక్షల ఎకరాలకు తగ్గింది. ఈ నేపథ్యంలో రబీలో రైతులు సొంత అవసరాలకు వినియోగించుకోగా మార్కెట్‌కు వచ్చే మిగులు వరి పంటను పూర్తి స్థాయిలో కేంద్రమే సేకరించాలి.  

దేశం రైతుల ఆగ్రహాన్ని చవిచూసింది 
కేంద్రం తీసుకున్న కొన్ని అస్థిరమైన, అనిశ్చిత విధానాలు రైతుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తిని కలిగిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశం మన రైతుల ఆగ్రహాన్ని చవి చూసింది. రైతు వ్యతిరేక చట్టాలను రూపొందించడం వల్ల వారు నిస్సహాయ స్థితితో తీవ్రంగా బాధపడ్డారు. రైతు ఆందోళనకు తలవంచి చివరికి ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top