
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఎమ్మెల్సీ కవిత ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలో ఈడీ సుదీర్ఘ విచారణను ఎదుర్కొని అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చిన కవిత నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను, ఇతర కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. కాగా, ఆదివారం సీఎం కేసీఆర్‌ని కలవాలని భావించారు.
ఈ మేరకు హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఉదయమే ప్రగతిభవన్‌కు వెళ్లగా, కవిత కొంత ఆలస్యంగా వచ్చారు. కవితతోపాటు హరీశ్‌రావు, కేటీఆర్, సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఈడీ జరిపిన 9 గంటల సుదీర్ఘ విచారణలో ఏం జరిగిందనే అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు... ఏం సమాధానాలు చెప్పారనే విషయంపై సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలిసింది. అనంతరం ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరయ్యే అంశంపై కూడా కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయనిపుణులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈడీ విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై కవితకు కేసీఆర్ కొన్ని కీలక సలహాలు, సూచనలు చేసినట్లుగా సమాచారం.