
శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ చేరుకున్న కవిత
తెలంగాణ తల వంచదు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని ఇలాంటి చర్యలతో లొంగదీసుకోవడం కుదరదు. తెలంగాణ తలవంచదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం.
– కవిత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. అయితే ముందే ఖరారైన కార్యక్రమాల కారణంగా 9న విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు తెలిపారు.
శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద.. ‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలి’ అనే డిమాండ్‌తో దీక్ష నిర్వహించనున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరవుతానని తెలిపారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, ఇతర కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు బుధవారం రాత్రి లేఖ రాశారు.
హడావుడిగా దర్యాప్తు చేయడం ఏమిటి?
ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం, హడావుడిగా దర్యాప్తు చేయడం ఏమిటంటూ ఈడీని కవిత ప్రశ్నించారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
వీటన్నింటినీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని అడిగారు. దర్యాప్తు పేరిట రాజకీయ చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లుగా స్పష్టమవుతోందన్నారు. అయినా ఒక సామాజిక కార్యకర్తగా వారం ముందే తన కార్యక్రమాలు ఖరారయ్యాయని, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని వివరించారు.
అదే సమయంలో దేశ పౌరురాలిగా, ఒక మహిళగా చట్టపరమైన అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని స్పష్టం చేశారు. ఇలావుండగా ఈడీ దర్యాప్తుకు సహకరిస్తానని బుధవారం ఉదయం విడుదల చేసిన ఓ లేఖలో కవిత స్పష్టం చేశారు. మరోవైపు గురువారం విచారణకు రాలేనన్న కవిత విజ్ఞప్తిపై ఈడీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా తాజా పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. బుధవారం ఉదయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.14లోని కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేడెక్కిన రాజకీయం
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్ మంత్రులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
కాగా కవిత తెలంగాణ తలదించుకునే పని చేసిందంటూ రాష్ట్ర బీజేపీ ధ్వజమెత్తింది. లిక్కర్ కుంభకోణంలో పాత్రధారిని అరెస్టు చేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. మరోవైపు కాంగ్రెస్..ఈడీ నోటీసులు, కవిత అరెస్టు ఊహాగానాలు ఇదంతా ఓ డ్రామా అని విమర్శించింది. ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని ఆడుతున్న నాటకమేనని వ్యాఖ్యానించింది.
10న బీఆర్‌ఎస్ సమాశం
బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ నేతలు, జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు తదితరులు హాజరుకానున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో..రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. కాగా కవితకు ఈడీ నోటీసులు, ఇతర తాజా పరిణామాలు, పార్టీ వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆహ్వానితులు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు.
ఢిల్లీ చేరుకున్న కవిత..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు దీక్ష ఏర్పాట్లు పరిశీలించడానికి కవిత బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం తుగ్లక్‌రోడ్ 23కు చేరుకున్నారు. ఆమె అక్కడే బస చేయనున్నారు. ఈడీ విచారణకు సంబంధించి న్యాయనిపుణులతో కవిత చర్చించే అవకాశం ఉందని తెలిసింది.
లాయర్లతో సమాలోచన..కేసీఆర్‌కు ఫోన్
ఈడీ నోటీసుల నేపథ్యంలో ఉదయం తన నివాసంలోనే న్యాయవాదులతో కవిత సమాలోచనలు జరిపారు. సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లేముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం దీక్ష కొనసాగించు. బీజేపీ అకృత్యాలను న్యాయపరంగా ఎదుర్కొందాం. పార్టీ పూర్తిగా నీకు అండగా ఉంటుంది..’ అని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను లొంగదీసుకోలేరు..
ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత బుధవారం ఉదయం ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టింది. ఈ క్రమంలోనే గురువారం ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది.
ఇలాంటి చర్యలతో.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని, తెలంగాణ తలవంచదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకాంక్షాపరులకు గుర్తు చేస్తున్నా. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం..’ అని కవిత స్పష్టం చేశారు.