ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగాలెందుకు?!.. అడవిలో ఆడపులులు వాళ్లు

International Womens day: Special Story On MAahabubabad Women Beat Officers  - Sakshi

వంటింటి కుందేళ్లన్నారు ఒకప్పుడు.. పులులతో సావాసం చేస్తున్నారిప్పుడు.. సున్నితత్వాన్ని ఆపాదించి కొన్నింటికే పరిమితం చేశారు.. అన్నింటినీ తలదన్ని అటవీ రక్షణకోసం నడుం కట్టారు.. పగలూ రాత్రి, తేడా లేదు.. ఎండా, వానల బెంగేలేదు  అడవి కాచిన వెన్నెలను ఆస్వాదిస్తూ.. కలప స్మగ్లర్లనూ ఎదిరిస్తూ.. ప్రతిరోజూ సాహసంతో సహవాసం చేస్తున్నారు  ‘మహిళా దినోత్సవం’సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడెం, గంగారం అడవిలోని బీట్‌ ఆఫీసర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

సాక్షి, మహబూబాబాద్‌/కొత్తగూడ: అడవి, అటవీ ఉత్పత్తులను కాపాడటం బీట్‌ ఆఫీసర్ల విధి. అసలు ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగాలెందుకనే ప్రశ్నల నుంచి... మైదానాల్నే కాదు అడవులనూ రక్షించగలమని బాధ్యతలు తీసుకున్నారీ మహిళలు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, గంగారం రేంజ్‌ నుండి సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని దట్టమైన అడవిలో పూనుగుండ్ల, జంగాలగూడెం, మర్రిగూడెం, మడగూడెం, కొడిశల మిట్ల, పందెం, కార్లాయి వంటి గ్రామాలు. ఎటూ 30 కిలోమీటర్ల వైశాల్యం. ఎనిమిది మంది మహిళలు బీట్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు.

ఓవైపు క్రూర మృగాలు.. మరోవైపు కలప స్మగ్లర్లు. అన్నివైపుల నుంచి సవాళ్లనూ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాంపుగా వెళ్తారు. మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఒక్కసారి అడవిలోకి అడుగుపెట్టారంటే... మొబైల్‌ సిగ్నల్స్‌ ఉండవు. వెంట తీసుకెళ్లిన ఆహారం అయిపోతే ఇక ఉపవాసమే. ఒక్కోసారి సెలయేరుల్లో నీటిని తాగాల్సి వస్తుంది. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి. తరుచుగా పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, ఇతర మృగాలు సంచరిస్తూ ఉంటాయి.  గిరిజనులకు రక్షణ కల్పించేందుకు వాటి సంచారాన్ని గుర్తించాలి. ఏ వైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. 

ప్రాణాలను పణంగా పెట్టి... 
అటవీ ప్రాంతం... టేకు, నల్లమద్ది, జిట్రేగు వంటి విలువైన కలపకు నెలవు. వీటిని దొంగిలించేందుకు స్మగ్లర్ల సంచారమూ ఎక్కువ. రాత్రి పగలు అనే తేడా లేకుండా అటవీ మార్గంలోని చెక్‌ పోస్టులు, డొంకదారుల వద్ద కాపు కాస్తుంటారు. జంతువుల నుండి ఆత్మరక్షణ పొందేందుకు ప్రభుత్వం ఇచ్చిన కొడవలిని పోలిన ఆయుధం ఒక్కటే ఉంటుంది. వాహనాలకు ఎదురు పోతే ఢీకొట్టి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో స్మగ్లర్లను పట్టుకోవడం, ప్రభుత్వానికి అప్పగించడం... ప్రాణాలను పణంగా పెట్టి అడవిలో పెట్రోలింగ్‌ చేస్తుంటారు.  

అధికారులు, ఆదివాసీల మధ్య... 
రోజురోజుకూ అంతరించి పోతున్న అడవిని కాపాడటం వారి బాధ్యత. ఇందులో భాగంగా పోడు కొట్టడం, అటవీ భూముల్లో వ్యవసాయం చేసే రైతులను అడ్డుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దీంతో అటవీ ప్రాంతానికి వెళ్లి ట్రంచ్‌(కందకం)లు తీయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు గిరిజనుల నుండి ప్రతిఘటన ఎదురవుతుంది. వారు దాడులు చేసే ప్రమాదమూ ఉంటుంది. కానీ విధి కదా. బాధ్యతగా నిర్వర్తించాలి. ఇక బాధ్యతల్లో ఉన్నది అడవి బిడ్డలైదే... అటు అధికారుల ఆదేశాలు... ఇటు తమ జాతి బతుకుదెరువు. ఎటూ తేల్చుకోలేని స్థితి. గిరిజనులను ఒప్పించడము కత్తిమీద సామే. అటు బంధాలకు బంధీలవ్వకుండా, అధికారుల ఆదేశాలను గౌరవిస్తూ... బ్యాలెన్స్‌డ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

బీటెక్‌ చదివి... బీట్‌ ఆఫీసర్‌గా 
మంచి ఇంజనీర్‌ అవ్వాలనుకున్నా. ఈలోపే బీట్‌ ఆఫీసర్‌ నోటిఫికేషన్‌ పడింది. అప్లై చేస్తే ఉద్యోగం వచ్చింది. బీటెక్‌ చదివి... బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగమా? అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడమే అదృష్టం. వచ్చిన ఉద్యోగాన్ని అంకితభావంతో చేయాలనుకున్నా. ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నా.  
– దుబ్బ స్రవంతి, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ 

 చాలెంజింగ్‌గా ఉంది... 
మాది మంగపేట మండలం. టీచర్‌ కావాలనుకున్నా. బీఈడీ చదివిన. ఉపాధ్యాయ పోస్టులు పడలేదు. ఈలోపే ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు పడ్డాయి. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. ఇది కఠినమైన ఉద్యోగమని ఇంట్లో వాళ్లు భయపడ్డారు. ‘మగవాళ్లు చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు’అని ఉద్యోగంలో చేరాను. విధి నిర్వహణ చాలెంజింగ్‌గా ఉంది.
  – కొండ లక్ష్మి, ఫారెస్టు బీట్‌ఆఫీసర్‌ 

అదృష్టంగా భావిస్తా..  
మాది ములుగు జిల్లా మేడారం. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చేశాను. అడవిలో పుట్టి పెరిగిన నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలుగన్నాను. మా ఇండ్లలో ప్రభుత్వ ఉద్యోగం రావడమే అదృష్టం. ఈ ఉద్యోగం వచ్చింది. అమ్మ, నాన్నలు కూడా ప్రోత్సహించారు. అడవిబిడ్డగా ఆదివాసీల మధ్య ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నా.  
– ఆలెం వసంతలక్ష్మి, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ 

చిన్న పిల్లలను విడిచి నైట్‌ పెట్రోలింగ్‌కు... 
మాది ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాడగూడ. కొత్తగూడ రేంజ్‌లో బీట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా. కఠినమైన ఈ డ్యూటీలో చేరాలంటే ముందు భయపడ్డా. నాకు ఇద్దరు పిల్లలు. పసిపిల్లలను ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం క్యాంపు ఆఫీసులో విడిచిపెట్టి నైట్‌ పెట్రోలింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలా... ఉద్యోగమా అనుకున్నప్పుడు. రెండూ ముఖ్యమే అనిపించింది. అలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగేయకుండా పనిచేసినందుకు గర్వంగా ఉంటుంది.  
 –బంగారం లలిత, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ 

కత్తిమీద సాములా... 
మాది గంగారం అడవి ప్రాంతంలోని మడగూడెం. నేను డిగ్రీ చదివిన. 2013లో బీట్‌ ఆఫీసర్‌గా చేరాను. కొంత కాలం ములుగు, ఏటూరు నాగారం ప్రాంతాల్లో పనిచేశాను. ఇప్పుడు కొత్తగూడ రేంజ్‌లో పనిచేస్తున్నాను. గత ఏడాది గిరిజనుల భూముల్లో ట్రంచ్‌లు వేసేందుకు వెళ్లాను. ఒక వైపు అధికారుల ఆదేశాలు. మరో వైపు ఆదివాసీ గిరిజనుల ఆందోళనలు. అడవి బిడ్డగా వారి వాదన సమంజసమే అనిపిస్తుంది. అయినా నా విధులు నేను నిర్వర్తించాలి. ఇలాంటప్పుడు కత్తిమీద సాములా ఉంటుంది. 
– సుంచ సంధ్యారాణి, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top