వారెవ్వా ఐపాస్‌... ప్రగతి పట్టాలపై పారశ్రామిక పరుగు

Industrial Run On Progress Rails No One Position Joint District - Sakshi

కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగం మళ్లీ ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతోంది. గత ఏడేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్‌ అగ్రభాగాన ఉండగా..రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర ఖజానాకు మూడో వంతు ఆదాయాన్ని సమకూర్చడమేగాకుండా నిరుద్యోగులకు ఉపాధిలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే–2021లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే టాప్‌లో నిలిచింది. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్ట్స్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ప్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌ ఐపాస్‌) విధానంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత (2014–21 మధ్య) జిల్లాకు రూ.29,488 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఏర్పాటు చేసిన 5,362 కంపెనీల వల్ల 2,62,018 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంతేకాదు నగరశివారులో ఏర్పాటు చేసిన ఈ సంస్థల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూ రాయి.

ఫలితంగా జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్‌ కొనసాగుతోంది. పరిశ్రమల ఏర్పాటు లో మాత్రం మేడ్చల్‌ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడేళ్లలో మేడ్చల్‌ జిల్లాలో 3,805 కంపెనీలు ఏర్పాటు కాగా, రంగారెడ్డిజిల్లాలో 1,137 కం పెనీలు వచ్చాయి. వీటి ద్వారా 1,60,382 మందికి ఉపాధి లభించింది. ఉత్పత్తుల ఎగుమతుల్లో మేడ్చల్‌ 25.52శాతంతో మొదటి స్థానంలో ఉంటే, అదే రం గారెడ్డి 16.97 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.

దేశంలోనే ఆదర్శంగా నిలిచిన టీఎస్‌–ఐపాస్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులతో అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష విధానంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జారీ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాకాలు ప్రకటిస్తుంది. ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.  

మచ్చుకు కొన్ని..
ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్‌ విడిభాగాల ఉత్పత్తిని చేపడుతున్న జిల్లా త్వరలోనే రైల్వేకోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రం కానుంది. శంకర్‌పల్లి మండలం కొండకల్‌ వద్ద మేద సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేసింది. ఏటా 500 రైల్వే కోచ్‌లు, 50 లోకోమోటివ్‌లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంతేకాదు 2,200 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మహేశ్వరం మండలం కేసీతండాలో ఎలక్ట్రిక్‌ హార్ట్‌వేర్‌ పార్క్‌లో రూ.300 కోట్లతో విప్రో కన్జ్యూమర్‌ కంపెనీ స్థాపించింది. 900 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ దీన్ని ప్రారంభించారు. 

ఐపాస్‌తో పెరిగిన వేగం
పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత పారిశ్రామిక వాడలను మరింత విస్తరించడంతో పాటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మంఖాల్, మహే శ్వరం, షాబాద్, తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఫుడ్‌ పార్కులు, ప్లాస్టిక్‌ అండ్‌ లెదర్‌ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నాం. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. రవాణా, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.  
– రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ, అధికారి  

(చదవండి: హైదరాబాద్‌కు పాడ్‌ కార్స్, రోప్‌వేస్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top