చిత్తు పేపర్లు బంగారమాయె!

HYD: Waste Paper Price Highly Increased Due Corona Effect - Sakshi

పొట్లం కట్టేందుకూ కటకటే

నగరంలో భారీగా పెరిగిన డిమాండ్‌

గతంలో కిలో రూ.15.. ప్రస్తుతం రూ.40

రోజుకు 250 నుంచి 150 టన్నులకు పడిపోయిన విక్రయాలు

కోవిడ్‌ ప్రభావమే ప్రధాన కారణం

సాక్షి, హైదరాబాద్‌: చిత్తు కాగితం బంగారమైపోయింది. నాలుగు బజ్జీలు పొట్లం చుట్టివ్వాలన్నా, ఇడ్లీ, దోశలు ప్యాక్‌ చేయాలన్నా ఓ  కాగితం కావాల్సిందే. మరి.. అలాంటి కాగితానికే పెద్ద కరువొచ్చి పడింది. కిరాణా దుకాణాలు, టిఫిన్‌సెంటర్లు, చుడువా బండ్లు, పాన్‌షాపులలో కాగితానికి కటకట ఏర్పడింది. హైదరాబాద్‌ నుంచి పేపర్‌ మిల్లులకు తరలించే కాగితం ఎగుమతులు సైతం భారీగా పడిపోయాయి. కోవిడ్‌ నేపథ్యంలో వివిధ రకాల కాగితం వినియోగం బాగా తగ్గిపోయింది.

స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. న్యూస్‌పేపర్లతో పాటు వివిధ రూపాల్లో వినియోగించే  కాగితం  కొరత తలెత్తింది. దీంతో  కొంతకాలంగా నగరంలో చిత్తు కాగితానికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. గతంలో కేవలం రూ.10 నుంచి రూ.15కే కిలో చొప్పున లభించిన స్క్రాప్‌ పేపర్‌ ఇప్పుడు ఏకంగా  రూ.40కి చేరుకొంది. నగరంలో చిత్తుకాగితాల వ్యాపారం  30 శాతానికి పైగా పడిపోయినట్లు వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
  
గృహ వ్యర్థాల్లో తగ్గుదల..  

సాధారణంగా ఇళ్లలో వివిధ రూపాల్లో కాగితం పేరుకుంటుంది. చదివి పక్కన పెట్టిన దినపత్రికలు, పిల్లలు ఏటా వినియోగించే నోట్‌ పుస్తకాలు, వస్తువులతో పాటు వచ్చే ప్యాకింగ్‌ పేపర్, మేగజైన్లు, మెడికల్‌ బాక్సులతో వచ్చే పేపర్లు తదితర రకాల్లో ఇళ్లలోకి వచ్చి చేరే కాగితాన్ని కిలోల లెక్కన చిల్లర వ్యాపారులకు  విక్రయిస్తారు. ఇల్లిల్లూ తిరిగి కాగితాలు సేకరించే  చిరు వ్యాపారులు ఒక స్థాయి పెద్ద వ్యాపారులకు క్వింటాళ్లలో విక్రయిస్తారు. హైదరాబాద్‌లో  వందలాది మంది వ్యాపారులు పెద్ద పెద్ద గోడౌన్‌లను ఏర్పాటు చేసుకొని చిల్లర వర్తకుల నుంచి కాగితం కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన కాగితాన్ని బడా వ్యాపారులు టన్నుల్లో కొనుగోలు చేసి పేపర్‌ మిల్లులకు తరలిస్తారు. 

బేగంబజార్, కోఠి, మలక్‌పేట్, అంబర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ వ్యాపారులు గతంలో  రోజుకు 250 టన్నుల వరకు కొనుగోలు చేసి  ఎగుమతి  చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి 150 టన్నుల చిత్తుకాగితాలు కూడా లభించడం లేదని అంబర్‌పేట్‌కు చెందిన రాజేందర్‌ అనే వ్యాపారి తెలిపారు. 30  శాతానికి పైగా కాగితం వినియోగం తగ్గిందన్నారు. ‘కాగితం తిరిగి మార్కెట్‌లోకి రావాలంటే స్క్రాప్‌ పేపర్‌  మిల్లులకు  వెళ్లాల్సిందే. కానీ తగినంత స్క్రాప్‌ అందుబాటులో లేకపోవడంతో  కాగితం ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది’ అని  చెప్పారు.  

ప్లాస్టిక్‌ వ్యర్థాలే మిగిలాయి..  
ఇతని పేరు మారుతి. ఉప్పల్‌లో నివాసం. చాలా ఏళ్లుగా చిత్తు కాగితాలను సేకరించి  హోల్‌సేల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. కాగితంతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, బాటిళ్లు తదితర గృహ వ్యర్థాలను కొనుగోలు చేస్తాడు. ఏడాది కాలంగా  కాగితం పెద్దగా లభించడం లేదని, ప్లాస్టిక్‌ వ్యర్థాలపైనే  ఆధారపడాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ‘రెండేళ్ల క్రితం వారానికి  రెండు వందల క్వింటాళ్ల చొప్పున చిత్తుకాగితాలు విక్రయించాను. ఇప్పుడు  50 కిలోలు కూడా లభించడం లేదు. పైగా సేకరించిన కాగితం గోడౌన్‌లకు చేరకుండానే టిఫిన్‌సెంటర్లు, కిరాణా దుకాణాల వాళ్లు కొనుక్కెళ్తున్నారు గతంలో కేవలం రూ.8కే కిలో చొప్పున సేకరించి హోల్‌సేల్‌ వ్యాపారులకు  రూ.15కు కిలో చొప్పున విక్రయించారు. ఇప్పుడు చిల్లర వర్తకులే కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సివస్తోంది’ అని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top