వరంగల్‌లో సత్ఫలితాలిస్తున్న ‘నయీ కిరణ్‌’.. సాయం పొందండిలా!

How 159 People De Addiction Warangal International Day Against Drug Abuse - Sakshi

పుస్తకాల తోటలో విహరించాలని నూనూగు మీసాలు పట్నపుదారులు వెతుకుతున్నాయి. పుస్తకాలు చదివి అనుభవించాల్సిన ఆనందాన్ని పొగ పీలుస్తూ.. లెక్చరర్లు చెప్పింది విని రక్తంలోకెక్కించుకోవాల్సిన జ్ఞానాన్ని రసాయనాల రూపంలో మత్తు ఎక్కించుకుంటూ యువత తాత్కాలిక ఆనందాన్ని పొందుతోంది. మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని ఆ ఊబిలోనుంచి బయటపడేసి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై ఆ తర్వాత మార్పు పొందిన యువత, వారి తల్లిదండ్రుల మనోగతంపై ఆదివారం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.  
– వరంగల్‌ క్రైం

ఉన్నత చదువుల కోసం నగరానికి వస్తున్న యువకుల్లో కొంతమంది గంజాయికి బానిసవుతున్నారు.  ఆ ఊబినుంచి బయటపడేస్తూ.. గంజాయి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దడానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సీపీ తరుణ్‌ జోషి, బన్ను ఆరోగ్య సంస్థ, ఎంజీఎం అధికారుల సహకా రంతో ఏర్పాటు చేసిన నయీ కిరణ్‌ కార్యక్రమం ద్వారా గంజాయికి బానిసైన వారికి కొత్త జీవితాన్ని స్తున్నారు.

మొదటి దశలో 159 మంది డ్రగ్స్‌ బాధితుల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో పాటు పోలీస్‌స్టేషన్ల అధికారులు గంజాయి తాగేవారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. సుమారు వందరోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్‌ బాధితులు సాధారణ జీవితం గడిపేలా చేశారు. కమిషనరేట్‌ అధికారులు నిర్వహించిన జాబ్‌మేళాలో వారి అర్హతకు అనుగుణంగా 38 మంది బాధితులు ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో నూతన వెలుగులు కనిపిస్తున్నాయి. 

జీవితాన్ని తీర్చిదిద్దారు..
నగరంలో కళాశాలలో డిగ్రీ చేస్తున్నప్పుడు స్నేహితులతో సిగరేట్లు తాగడం అలవాటైంది. కాజీపేటలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ చదువుకున్నా. రోజూ సిగరెట్లు తాగుతున్నానని అనుకున్నా.. కానీ అందులో గంజాయి ఉందనే విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. 10 బీర్లు తాగితే ఎలా ఉంటుందో ఒక గంజాయి సిగరేట్‌ తాగితే అలా మత్తు ఉండేది. నయీకిరణ్‌ కార్యక్రమం ద్వారా ఎంజీఎంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పోలీసులు నా జీవితాన్ని తీర్చిదిద్దారు. 
– పాల సాయికుమార్, కరీంనగర్‌

1నా కొడుకు దక్కేవాడు కాదు..
నాది ప్రభుత్వ ఉద్యోగం. ఉదయం వెళ్తే.. రాత్రెప్పుడో వచ్చేవాణ్ణి. నా కొడుకు నేను పడుకున్నాక వచ్చి పడుకునేవాడు. రాత్రి లేటైంది కదాని.. ఉదయమే వాడిని లేపకపోయేవాణ్ని. నా కొడుకు గంజాయి తాగుతూ పట్టుబడినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. పోలీసుల సహకారంతో వాడి అలవాటు మానుకున్నాడు. నాకొడుకు నాకు దక్కాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు. 
– చంద్రమోహన్, రాంనగర్, ప్రభుత్వ ఉద్యోగి  (పేరు మార్చాం)

బలవంతంగా అలవాటు చేశారు..
నా స్నేహితుల మాదిరి సరదాగా గడపాలనే కోరిక ఉండేది. వాళ్లతో కలిసి తిరిగాక నాకూ సిగరేట్‌ అలవాటు చేశారు. ఆ™ è ర్వాత మరింత ఎంజాయ్‌మెంట్‌ కోసమని సిగరెట్లో గంజాయి కలిపి తాగించారు. మత్తుగా ఉండడంతో ఒకటి రెండు సార్లు తాగాను. ఒకరోజు గంజాయి తాగుతూ పోలీసులకు దొరికాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్, మనోధైర్యం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. 
– విక్రమ్‌ డిప్లొమా విద్యార్థి, హనుమకొండ (పేరు మార్చాం)

ఉద్యోగం పోయింది..
నేను హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగం చేసేవాణ్ణి. అక్కడికి వచ్చే కస్టమర్ల ద్వారా నాకూ గంజాయి అలవాటయ్యింది. మత్తులో సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఉద్యోగంలోంచి తీసేశారు. ఇంటికొచ్చి న తర్వాత అలవాటు మానలేకపోయా. నయీ కిరణ్‌ గురించి తెలుసుకొని పోలీసులను సంప్రదించా. వంద రోజుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నా అలవాటును పూర్తిగా మరిచిపోయా. ప్రస్తుతం మళ్లీ ఉద్యోగ వేటలో ఉన్నా. 
– ప్రశాంత్, ధర్మసాగర్‌ (పేరు మార్చాం)

గంజాయిపై ఉక్కుపాదం
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్‌ను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి ప్రత్యేక దృష్టి పెట్టారు.  అమ్మకందారులతోపాటు వినియోగదారులపై పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో రూ.4.10 కోట్ల విలువైన 3,918 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 44 కేసులు నమోదు చేసి 155 మందిని అరెస్టు చేశారు. 

సాయం పొందండిలా..
గంజాయి, ఇతర డ్రగ్స్‌కు అలవాటు పడి మానుకోవాలనుకునే వారు, వారి తల్లిదండ్రులు ‘నయీకిరణ్‌’ టోల్‌ ఫ్రీ 94918 60824 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు. పోలీస్‌ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి డ్రగ్స్‌ బాధితుల్లో మార్పులు తీసుకొస్తారు. ఏప్రాంతం వారైనా సాయం పొందవచ్చు. 

159 మంది.. 100 రోజులు
159 మంది డ్రగ్స్‌ బాధితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసైన వారికి డాక్టర్లతో తల్లిదండ్రుల సమక్షంలో చికిత్స అందించాం. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వారిలో మంచి మార్పులు తీసుకొచ్చాం. మొదటి రెండు వారాలు డీ టాక్సిఫికేషన్‌ కార్యక్రమం, ఆతర్వాత డీ ఎడిక్షన్‌లో ప్రముఖులతో మాట్లాడించాం. హనుమకొండ కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ప్రభుత్వ చీఫ్‌ విప్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, మేయర్, ఇలా చాలామందితో మాట్లాడించి డ్రగ్స్‌ బాధితుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. హైదరాబాద్‌ నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి గ్రూప్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చాం. పోలీస్‌ కమిషనర్‌ నుంచి హోంగార్డు వరకు గంజాయి నుంచి యువతకు విముక్తి కల్పించడానికి ప్రయత్నంచేస్తున్నాం. 
– పుష్పారెడ్డి, అడిషనల్‌ డీసీపీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top