రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల తీరుతో రైతుల ఇక్కట్లు
లారీలు, హమాలీల కొరతతో చాలాచోట్ల ఎక్కడి ధాన్యం అక్కడే..
ఎత్తిన ధాన్యం దించరు.. దించితే తరుగు, తాలు, తేమ పేరుతో కోతలు
కొన్నిచోట్ల పేరుకే కేంద్రాలు..కొనుగోళ్లు సాగని వైనం
ఖరీఫ్ ముంచుకొస్తున్నా ఇంకా నత్తనడకగానే సేకరణ
లక్ష్యం 90 లక్షల మెట్రికల్ టన్నులు.. కొన్నది 30 లక్షల ఎల్‌ఎంటీలే!
మక్కలు, జొన్నల కొనుగోళ్ల పరిస్థితీ ఇదే..
అకాల వర్షాల భయంతో రైతులు.. పంటలు కొనాలంటూ ఆందోళన
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపి కుట్టిపెట్టారు. కానీ ఐదు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం అక్కడే అలాగే ఉంది. ఈ కేంద్రంలో 15 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కానీ లారీలు రాక కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరిచామని, భారీగా ధాన్యం సేకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటినా కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం తీసుకోవడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కాంటా వేయడం, కాంటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగా లేదని, హమాలీల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. రైతుల ఆందోళనకు తగినట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లు ధాన్యం రాశులతో నిండిపోయి కన్పిస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తుండటంతో, తమ పంట ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ వంటి చాలా జిల్లాల్లో రాశులు పోసిన ధాన్యం తడిచిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ధాన్యం తడవకుండా తగిన సంఖ్యలో టార్పాలిన్‌లు సరఫరా చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మక్కలు, జొన్నల కొనుగోళ్ల పరిస్థితీ ఇదేనని రైతులు వాపోతున్నారు.
లక్ష్యంలో మూడో వంతే..!
ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 8,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లోని మండలాల్లో పేరుకు కొనుగోలు కేంద్రాలే తప్ప, అక్కడ కొనుగోళ్లు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. అంటే లక్ష్యంలో మూడో వంతు మాత్రమే పూర్తయ్యిందన్నమాట. జూన్ నెల సమీపిస్తుండటంతో ఖరీఫ్ పనులు మొదలయ్యే సమయం ఆసన్నమైనా, ఇంకా రబీ పంట కొనుగోళ్లే పూర్తి కాకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి 15 రోజులకు పైగా రైతులు నిరీక్షిస్తున్న పరిస్థితి చాలా జిల్లాల్లో ఉంది. మంగళవారంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఇంకా కదిలిన దాఖలాలు కన్పించడం లేదు.
అన్నీ సమస్యలే..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడమే ఒక ప్రహసనమైతే, వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో పెద్ద యుద్ధంలా మారింది. లారీలు రాక రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒకవేళ మిల్లుకు ధాన్యం చేరినా, అక్కడ మిల్లర్లు పెట్టే ఆంక్షలతో రైతులు బిక్క ముఖం వేస్తున్నారు. తరుగు, తాలు, తేమ శాతం పేరుతో యధావిధిగానే కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగానే రైతుతో లావాదేవీలు ముగియాల్సి ఉండగా, మిల్లులకు వెళ్లిన తరువాత తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో తరుగు పేరిట నాలుగైదు కిలోల ధాన్యాన్ని తరుగుగా తీసే విధానం ఇంకా కొనసాగుతోందని పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు తెలిపారు. ధాన్యం ఎత్తుకోవడానికి, దించుకోవడానికి సవాలక్ష సాకులు చెబుతూ లారీలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
మక్కల సేకరణలో మార్క్‌ఫెడ్ విఫలం!
వరి రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మొక్కజొన్న (మక్కలు) పండించిన రైతుల గోస వర్ణనాతీతం. రాష్ట్రంలో రబీలో పెరిగిన మక్కజొన్న సాగు నేపథ్యంలో ఈసారి సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అయితే మక్కల కొనుగోళ్లలో మార్క్‌ఫెడ్ అపసోపాలు పడుతోంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మార్కెట్‌కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటివరకు మార్క్‌ఫెడ్ ఎండీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని ఇటీవలే తప్పించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను నియమించింది. అయితే కొన్ని జిల్లాల్లో పాతుకుపోయిన మార్క్‌ఫెడ్ మేనేజర్లు కొనుగోళ్లు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆఫీసుల్లో కూర్చొని అవినీతి కార్యకలాపాలు సాగించేందుకు అలవాటు పడిన అధికారులు మక్కల కొనుగోళ్లు చేయలేకపోతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మక్కలు కొనడానికి కనీసం గోనె సంచులు సమకూర్చుకోలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.97 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, అతికష్టంమ్మీద 1.83 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. చాలా చోట్ల సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాగర్‌కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం ప్రాంతాల్లో కొనుగోళ్ల కోసం రైతులు మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లలో ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంది. తగిన సంఖ్యలో గోదాములు లేకపోవడం కూడా సమస్యగా మారింది.
ప్రైవేటుకు అమ్ముకుంటున్నాను..
70 క్వింటాళ్ల మక్కలు రూ.1,750 చొప్పున ప్రైవేటుగా అమ్ముకున్నా. ఇంకా 50 కింటాళ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రైవేట్‌గానే అమ్ముతా. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలారోజుల సమయం పడుతుంది. ఇంటిదగ్గర గొర్లు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లేవారు ఎవరూ లేరు. అందుకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నా.
– మల్లేష్, దేశీటికాల, నాగర్ కర్నూల్.
మొక్కజొన్న ఎప్పుడు కొంటారో చెప్పడం లేదు..
నేను నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డ్‌కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చి నెల రోజులు దాటింది. సుమారు 200 క్వింటాళ్ల పంటను అమ్ముకునేందుకు రోజూ మార్కెట్ యార్డుకు వస్తున్నాను. కానీ ఫలితం లేదు. కనీసం ఎప్పుడు కొనుగోలు చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు.
– సిక్కొండ రాములు, మంతటి, నాగర్ కర్నూల్ మండలం


