
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సుదీర్ఘంగా విచారించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించింది. మధ్యలో గంట విరామం పోగా.. ఎనిమిది గంటల పాటు విచారణ సాగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సేకరించిన ఆధారాలు, అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా.. కవిత నుంచి సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. ప్రతి అంశాన్ని విడివిడిగా ప్రస్తావిస్తూ, వాంగ్మూలాలతో, ఆధారాలతో సరిపోల్చుకుంటూ.. కవిత చెప్పిన సమాధానాలను రికార్డు చేసుకున్నారు. చివరిగా ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.
11 గంటలకు మొదలై..
శనివారం ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెను జాయింట్ డైరెక్టర్, మహిళా డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడిన ఈడీ బృందం విచారించినట్టు తెలిసింది. ఇండోస్పిరిట్స్ ఎల్1 దరఖాస్తు విషయంలో సమస్యలు వస్తే అరుణ్ పిళ్‌లై ద్వారా తనకు తెలియజేయాలని.. తనస్థాయిలో పరిష్కరిస్తానని సమీర్ మహేంద్రుకు కవిత తెలిపారని ఈడీ చార్జిషీటులో పేర్కొన్న నేపథ్యంలో.. ఈ అంశంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ‘‘ఢిల్లీ మద్యం పాలసీలో మీ పాత్ర ఎంత వరకు ఉంది? మీ స్థాయిలో ఏం చేశారు? అరుణ్ పిళ్‌లై, శ్రీనివాసరావు, బుచ్చిబాబు, విజయ్‌నాయర్ తదితరులు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో మీ గురించి చెప్పిన అంశాలపై మీ వివరణ ఏంటి’’ అని ఆరా తీసినట్టు సమాచారం.
వీటన్నింటినీ ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ పూర్తి స్థాయి వివరణ తీసుకున్నట్టు తెలిసింది. ‘‘హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్, ఢిల్లీ ఒబెరాయ్ మైడెన్స్‌లలో జరిగిన సమావేశాల్లో ఏం మాట్లాడారు? మద్యం విధానం రూపకల్పనలో మార్పులు, చేర్పులపై ఆప్ అగ్రశ్రేణి నేతలతో ఏమైనా చర్చించారా? కిక్‌బ్యాక్‌ల రూపంలో రూ.100 కోట్లు వెనక్కి రావడానికి, లాభాల్లో ఆప్‌కు ముడుపులు ఇవ్వడానికి కుదిరిన ఒప్పందం ఏమిటి?’’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూపునకు ఫ్రంట్ మన్‌గా ఉన్న అరుణ్ పిళ్‌లై కవితకు బినామీయేనా అనే కోణంలోనూ విచారించినట్టు సమాచారం.
ఈడీ విచారణకు వెళ్లేముందు ఢిల్లీలోని కవిత నివాసం వద్ద ఆమెకు మద్దతుగా నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు
ఆప్ నేతలతో చర్చించారా?
సౌత్ గ్రూపు ఓ కార్టెల్‌గా ఏర్పాటై ఎల్1 లైసెన్సు, రిటైల్ జోన్లు తీసుకోవడంలో ఆప్ నేతలతో జరిగిన చర్చల్లో కవిత పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. వాట్సాప్ చాట్‌ల ద్వారా సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, కవితలకు ఇండో స్పిరిట్స్‌లో 33 శాతం చొప్పున వాటా అనుకుంటున్నామని విజయ్‌నాయర్ వాంగ్మూలంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రశ్నించినట్టు సమాచారం.
ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఆధారంగా.. ‘‘మద్యం విధానం రూపకల్పన సమయంలో ఢిల్లీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సీఎంలతో ఉన్న రాజకీయ అవగాహన ఏంటి? పాలసీ అనుకూలంగా ఉంటే ఇస్తానన్న ముడుపులు ఎంత? ఏ విధంగా ఆ మొత్తం ఢిల్లీకి తరలించారు? హైదరాబాద్‌లోని నివాసంలో భర్తతో కలిసి సమీర్ మహేంద్రుతో ఏయే అంశాలు చర్చించారు? అరుణ్ పిళ్‌లైతో చేస్తున్న వ్యాపారాలేమిటి? ఢిల్లీ మద్యం వ్యాపారంలో పిళ్‌లై పేరిట పెట్టుబడి ఎంత?’’ అని ఆరా తీసినట్టు తెలిసింది. ఇక మద్యం విధానం రూపకల్పన సమయంలో రెండు ఫోన్లు మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ఫోన్లను ధ్వంసం చేశారా? ఎవరికైనా ఇచ్చారా? అనే కోణంలో విచారించినట్టు సమాచారం.
కవిత విచారణ సందర్భంగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు
కవిత ఫోన్‌పై రాని స్పష్టత!
విచారణ మధ్యలో కవిత ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా నివాసంలో ఉందని ఆమె చెప్పినట్టు సమాచారం. ఆ ఫోన్ తెప్పించాలని అధికారులు కోరగా.. కవిత తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో ఫోన్ తెప్పించి ఇచ్చినట్టు తెలిసింది. అధికారులు ఆ ఫోన్‌ను క్లోనింగ్ చేసుకుని, తిరిగి ఇచ్చినట్టు సమాచారం.
సింగిల్‌గానే విచారణ
అరుణ్ పిళ్లైతో కలిపి కవితను విచారించనున్నట్టు ఈడీ వర్గాలు తొలుత వెల్లడించాయి. కానీ శనివారం ఎమ్మెల్సీ కవిత ఒక్కరినే విచారించినట్టు తెలిసింది. తాను కవితకు బినామీనంటూ కోర్టుకు ఈడీ సమర్పించిన వాంగ్మూలం నకిలీదని అరుణ్ పిళ్‌లై.. తాజాగా కోర్టును ఆశ్రయించారు. దీనితో పిళ్‌లైతో కలిపి కవితను విచారించలేదని సమాచారం. అయితే ఇప్పటికే కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కలిపి ఈ నెల 16న కవితను విచారించనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో బైబై మోదీ పేరిట వెలసిన పోస్టర్లు
పిళ్లై పిటిషన్‌పై కౌంటర్ వేయండి
లిక్కర్ కేసులో తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ అరుణ్ పిళ్‌లై దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 13లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. తన వాంగ్మూలాన్ని మార్చి, దానిపై సంతకం చేయాల్సిందిగా ఈడీ అధికారులు బలవంతం చేశారని పిళ్‌లై తన పిటిషన్‌లో ఆరోపించారు.