300 మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ జేపీఎస్‌లకు ఉద్వాసన 

Dismissal of over 300 outsourced JPSs - Sakshi

సెలవులు, జీవో 317 బదిలీపై వచ్చిన రెగ్యులర్‌ సెక్రటరీలకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు తొలగింపు 

పోటీ పరీక్ష రాసి ఎంపికైనా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమితులైనందునే.. 

తాజాగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద 800 పోస్టులకు నోటిఫై 

ఉద్యోగాలూ పోతాయేమోనని మిగతా ఔట్‌సోర్సింగ్‌ జేపీఎస్‌ల ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్‌) ఉద్వాసనకు గురయ్యారు. ఇటీవల వివిధ జిల్లాల్లో జీవో 317 ద్వారా బదిలీ చేసిన, మెటర్నిటీ లీవ్, లాంగ్‌ స్టాండింగ్‌ లీవ్‌ నుంచి వచ్చిన రెగ్యులర్‌ పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఔట్‌ సోర్సింగ్‌ సెక్రటరీలను ఆయా జిల్లాల్లోని డీపీవో (జిల్లా పంచాయతీ అధికారి)లు అకస్మాత్తుగా తప్పించారు. టీఎస్‌పీఆర్‌ఈ పోటీ పరీక్ష ద్వారా ర్యాంకు సాధించినా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో జేపీఎస్‌లుగా నియమితులవడంతో ఈ పరిస్థితి తప్పలేదు.  

ఖాళీలను నింపేందుకు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో.. 
2021 ఏప్రిల్‌ 12న జేపీఎస్‌లుగా 9,355 మందికి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. వీరిలో 1,200 మంది ఆయా పోస్టింగ్‌లకు అసలు రిపోర్ట్‌ చేయలేదు. విధుల్లో చేరిన 8,200 మందిలో గత మూడేళ్లలో వెయ్యి మందికి పైగా వివిధ కారణాలతో రాజీనామా చేయడమో లేదా బాధ్యతలను మధ్యలోనే వదిలేయడమో చేశారు. అయితే ప్రతి పంచాయతీకి ఓ సెక్రటరీని నియమించాలనే లక్ష్యంతో.. భర్తీ కానీ జేపీఎస్‌ పోస్టుల్లో ఆయా జిల్లాలు, మండలాల వారీగా గతంలో పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాతి ర్యాంకుల వారీగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో నియామకాలు చేపట్టారు. వీరికి పీఎఫ్, ఈఎస్‌ఐ మినహాయించి ఒక్కో జిల్లాలో ఒక్కోలా రూ. 10 వేల నుంచి రూ. 13 వేల దాకా జీతం ఇస్తున్నారు. ఇవి కూడా ఏ నెలకు ఆ నెల అందట్లేదని విమర్శలున్నాయి.  

పరీక్ష రాసి ఎంపికైనా తిప్పలే! 
జాతీయ స్థాయిలో యూపీఎస్‌సీ తరహాలో డిగ్రీ కనీస అర్హతగా నెగెటివ్‌ మార్కింగ్‌ (మైనస్‌ మార్కులు) పద్ధతితో పోటీ పరీక్ష రాసి ఎంపికైనా తమకు కష్టాలు తప్పట్లేదని ఔట్‌ సోర్సింగ్‌ జేపీఎస్‌లు అంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా చూపుతున్న 800 పంచాయతీ సెక్రటరీ పోస్టులను తాజాగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద భర్తీకి నోటిఫై చేశారు. దీంతో కొత్త రిక్రూట్‌మెంట్‌ జరిగాక తమకూ ఉద్వాసన తప్పదేమోనని మిగతా జేపీఎస్‌లకు భయం పట్టుకుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top