గురుకుల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో జాప్యం
కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన
జూలై నుంచి సీఓఈ సబ్జెక్ట్ అసోసియేట్లకు అందని జీతాలు
వేతనాల కోసం సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరగడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు ఐదో తేదీలోపు వేతనాలు అందుతుండగా.. ఇతర ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ విధానంలో ప్రభుత్వం పరిమిత స్థాయిలోనే వేతనాలు ఇస్తోందని, అయితే వాటిని కూడా నెలల తరబడి నిలుపుదల చేయడంతో కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందికరంగా మారుతోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ)ల్లో దాదాపు ఐదు వందల మందికి పైగా సబ్జెక్ట్ అసోసియేట్స్ పనిచేస్తున్నారు. వీరికి ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు వేతనాలు అందలేదు.
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి వీరిని నియమించుకున్న సొసైటీలు.. ఇప్పటికీ వేతనాలు విడుదల చేయలేదు. ఈ అంశంపై సొసైటీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయా సబ్జెక్ట్ అసోసియేట్స్ మండిపడుతున్నారు. మరోవైపు గురుకులాల్లో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లు, బోధనేతర సిబ్బంది, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు విడుదల కాలేదు.
సొసైటీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు..
ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో వారంతా సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సైతం వేతన చెల్లింపుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెలా చెల్లింపుల్లో జాప్యం జరగడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఉద్యోగులు మండిపడుతున్నారు.
వేతన చెల్లింపుల సమస్య పరిష్కరించాలని చాలారోజులుగా సొసైటీ కార్యాలయానికి వస్తున్నా.. కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు వేతన చెల్లింపుల అంశాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పడంతో అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు వేతనాలు అందడం లేదని ఉద్యోగులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నట్టు తెలిసింది.


