కాళేశ్వరం మనుగడ సాగిస్తుందా?  | CWC Asks Telangana Govt For Details On Fate Of Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం మనుగడ సాగిస్తుందా? 

Oct 16 2022 2:28 AM | Updated on Oct 16 2022 2:28 AM

CWC Asks Telangana Govt For Details On Fate Of Kaleshwaram Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కీలక ప్రశ్నలను సంధించింది. ప్రాజెక్టు పూర్తయిన నాటి నుంచి ఇప్పటివరకు నిర్వహణ, మరమ్మతుల వ్యయ గణాంకాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన మేరకు యూనిట్‌కు రూ.3కు చొప్పున విద్యుత్‌ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపిందా? ప్రస్తుత విద్యుత్‌ చార్జీలు ఎంత? విద్యుత్‌ చార్జీల వార్షిక సగటు ఎంత?

అన్న విషయాలపైనా ఆరా తీసింది. విద్యుత్‌ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకు ని భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ప్రాజెక్టు సుస్థిర మనుగడకు అవసరమైన ఆదాయ మార్గాలను విశ్లేషించాలని.. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన వాస్తవ వ్యయం, బ్యాంకు రుణాలు, వడ్డీరేట్ల వివరాలు ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు అనుమతికోసం రాష్ట్ర ప్రభుత్వం జూలైలో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించింది. అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ పలు కీలక వివరాలు కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. 

పంపుహౌజ్‌లు ఎందుకు మునిగాయి? 
రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా.. తర్వాత ఆయకట్టు స్థిరీకరణ పేరుతో అదనపు టీఎంసీ పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొత్తం 3 టీఎంసీల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్మాణాల (కాంపోనెంట్ల) డిజైన్లను సమర్పించాలని సీడబ్ల్యూసీ రాష్ట్ర నీటి పారుదలశాఖను కోరింది. ఇక ‘ప్రాజెక్టులోని పంపుహౌజ్‌లు ఎందుకు నీటమునిగాయి?

ప్రాజెక్టు డిజైన్లు ఎలా ఉన్నాయి? పంపుహౌజ్‌లు, సర్వీస్‌బే ఎత్తు ఎంత? జలాశయాల ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఎంత?’వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర పరిశీలన జరపాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను సమర్పించాలని ఆదేశించింది. ‘ఏ పంపుహౌజ్‌ ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లను తరలించారు? ఎంత ఆయకట్టుకు నీరందించారు?’అన్న విషయంలో వార్షిక గణాంకాలను అందించాలని సీడబ్ల్యూసీ కోరింది. పంపుల సంఖ్య, వాటి సామర్థ్యం, వ్యయం, తయారు చేసిన కంపెనీ వివరాలూ ఇవ్వాలని సూచించింది. 

కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియోపై అనుమానాలు
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో వివరాలపై సీడబ్ల్యూసీ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, ఉత్పాదక విలువ మధ్య నిష్పత్తిని కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో అంటారు. కాళేశ్వరం ఉత్పాదక వ్యయం కన్నా నిర్వహణ వ్యయమే అధికమని.. అదనపు పనులతో అదనపు ఆయకట్టు లేకున్నా, ప్రాజెక్టు వ్యయం పెరిగినా కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో ఎలా మెరుగైందని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది.

కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనుల విలువెంత? 
కాంట్రాక్టర్లకు కాళేశ్వరం పనుల అప్పగింతపైనా సీడబ్ల్యూసీ ప్రశ్నలు సంధించింది. టెండర్ల ద్వారా అన్ని రకాల కాంపోనెంట్ల పనులను ఏ తేదీకి అప్పగించారు? పనుల విలువ, పరిమాణం ఎంత? వంటి వివరాలను అందజేయాలని కోరింది.  

దూరంలో పెద్ద రిజర్వాయర్లు ఎందుకు? 
గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వంటి చిన్న రిజర్వాయర్లను నిర్మించి నదిలేని చోట మల్లన్నసాగర్‌ వంటి భారీ రిజర్వాయర్లను నిర్మించడాన్ని సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. ‘వేర్వేరు ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు గోదావరిపైనే భారీ జలాశయాలను ఎందుకు ప్లాన్‌ చేయలేదు? అధిక వ్యయం, భూసేకరణకు దారితీసేలా మేడిగడ్డ బ్యారేజీకి సుదూరంలో మల్లన్నసాగర్, బస్వాపురం వంటి జలాశయాలను ఎందుకు ప్లాన్‌ చేశారు?’అన్న విషయాలపై వివరణ కోరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement