ఫుల్లుగా పెట్రోల్‌.. అయినా ఉరుకులాటెందుకు? | Crude Oil Supply: Gap More Than Compensated India | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా పెట్రోల్‌.. అయినా ఉరుకులాటెందుకు?

Mar 26 2026 9:31 PM | Updated on Mar 27 2026 3:04 PM

Crude Oil Supply: Gap More Than Compensated India

హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పెట్రోల్‌ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిజానికి వాహనదారులు పెట్రోలు బంకుల వద్దకు అంత భారీగా వెళ్తూ ఫుల్‌ ట్యాంకు నింపించుకుంటున్నారు కాబట్టి కొన్ని బంకుల్లో పెట్రోల్‌ అయిపోతుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. లేని ప్రమాదాన్ని ఊహించుకుని ఆందోళన చెందుతున్నట్లు ఉంది వాహనదారుల తీరు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లోని పలు నగరాల్లో ప్రజల్లో భయం, ఆందోళన పెరిగాయి. ఏ అనుకోని పరిస్థితి వస్తుందోనన్న భయంతో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వ వివరణ ఇదే..
ఇరాన్‌ యుద్ధం వేళ క్రూడాయిల్ సరఫరా కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఆ లోటు పూర్తిగా భర్తీ అయింది. హార్మూజ్ జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితి ఉన్నా, భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 41కి పైగా సరఫరాదారుల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకు ముందు హార్మూజ్‌ జలసంధి ద్వారా వచ్చిన దానికంటే ఎక్కువ క్రూడాయిల్‌ను భారత్‌ పొందుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో (ముఖ్యంగా పశ్చిమ గోళార్థంలోని దేశాల్లో) క్రూడాయిల్‌ పెద్ద మొత్తంలో ఉంది. ఇతర ప్రాంతాలనుంచి సరఫరా జరగకపోతే వేరే మార్కెట్ల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవచ్చు. ప్రతి భారత రిఫైనరీ 100% కంటే ఎక్కువ వినియోగంతో నడుస్తోంది. భారత ఆయిల్ కంపెనీలు వచ్చే 60 రోజుల దేశ అవసరాలకు సరిపడే క్రూడాయిల్ సరఫరాల కోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. కాబట్టి దేశంలో లోటు ఉండే ప్రమాదం లేదు. సరఫరాలో ఎలాంటి లోటు లేదు.

ఈ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇదే..
పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని అధికారులు ఎంతగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు, పలు నగరాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు భయంతో వెళ్తున్నారు. ఇంధన లోటు ఉందేమోనన్న భయంతో ప్రజలు పొడవాటి క్యూల్లో నిలబడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement