క్యా కరోనా‌: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!

coronavirus second wave surges across india - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌షాక్: మాస్‌ రియాక్టివ్‌ డిప్రెషన్‌ ‌

కోవిడ్‌ ఉద్ధృతితో అనిశ్చితి, ఆందోళన 

సైకలాజికల్‌ ఇమ్యూనిటీపై  ప్రభావం 

మాస్‌ రియాక్టివ్‌ డిప్రెషన్‌తో భయాందోళన  

సాక్షి, సిటీబ్యూరో: మాస్‌ రియాక్టివ్‌ డిప్రెషన్‌ (ఎమ్మార్డీ). మానసిక వైద్య నిపుణులు కొత్తగా చెబుతున్న మాట ఇది. సాధారణంగా వ్యక్తులు కుంగుబాటు బారిన పడతారు. కానీ సమాజంలో ఎక్కువ మంది ఒకేసారి ఒకేవిధమైన ఆందోళన, డిప్రెషన్‌కు గురైతే.. అదే మాస్‌ రియాక్టివ్‌ డిప్రెషన్‌. కోవిడ్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ సృష్టించిన షాక్‌ ఇది. మొదటి దశ కంటే రెండో దశలోనే కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒకవైపు వైరస్‌ తమను ఏం చేయలేదనే తెగింపు ధోరణి కొంతమంది ఆలోచనా విధానంలో కనిపిస్తోంది. మరోవైపు తొలగిపోయిందనుకున్న మహమ్మారి తిరిగి విజృంభించడంతో నెలకొన్న భయాందోళనల కారణంగా మాస్‌  డిప్రెషన్‌ లక్షణాలు పెరుగుతున్నాయని సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నమ్మించి.. వంచించి 
► గతేడాది మార్చి నుంచి ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన కోవిడ్‌ సెప్టెంబర్‌ నాటికి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. నవంబర్‌ నెలలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. పెళ్లిళ్లు, వేడుకలు, పర్యటనలు, సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం వంటి వాటితో పాటు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరిగాయి. 
► సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితర అన్ని వ్యాపార, వినోద కేంద్రాలు తిరిగి తెరుచుకున్నాయి. జనంలో చాలా వరకు కోవిడ్‌ భయాందోళనలు తొలగిపోయాయి. ఒక భరోసా ఏర్పడింది. ఇక కోవిడ్‌ ముప్పు తొలగినట్లేనని భావించిన జనం మాస్కులు ధరించడం మానేశారు. 
► భౌతిక దూరం నిబంధన తొలగిపోయింది. సరిగ్గా  ఇలాంటి సమయంలోనే కోవిడ్‌ తిరిగి తన ప్రతాపాన్ని ప్రదర్శించడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరుకున్నాయి. ఇది మాస్‌ రియాక్టివ్‌  డిప్రెషన్‌కు దారితీసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఇమ్యూనిటీపై ఎఫెక్ట్‌ 
► సాధారణంగా కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్‌  ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధత లభిస్తుంది. కానీ మహమ్మారిని ఎదుర్కోవడంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యం.  
► వైరస్‌  రెండో దశకు విస్తరించడం  ఒకవైపు అయితే, మరోవైపు  వైరస్‌పై వివిధ రకాల ప్రచారంతో సైకలాజికల్‌ ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతోంది. తమకేదైనా అవుతుందేమోననే భయాంతో చాలామంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. దీనికి  కారణం వైరస్‌ ఎప్పటి వరకు తొలగిపోతుందనే అంశంపై స్పష్టత లేకపోవడమేనని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్‌ సంహిత  తెలిపారు.

సన్నద్ధతతోనే పరిష్కారం  
వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతి, తగ్గుముఖానికి అనుగుణంగా మానసిక సన్నద్ధతను పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం. శారీరక వ్యాయామంతో దృఢత్వం పెంచుకొన్నట్లుగానే ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి 
డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి 

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top