
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో వ్యాపార కార్యకలాపాలు లేక వ్యాపారులు గొల్లుమంటున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలతో కిటకిటలాడే మోండా మార్కెట్ వెలవెలపోతోంది. లాక్‌డౌన్ నిబంధనల మేరకు ఉదయం వేళ మాత్రమే తెరిచి ఉంటుంది. కరోనా భయంతో జనం అంతగా రాకపోవడంతో వ్యాపారాలు సాగకపోవడంతో ఎలా బతకాలంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టుక నుంచి చావు వరకు, శుభకార్యాలు, ఇతరత్రా ఫంక్షన్లకు అన్ని రకాల వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా మోండా మార్కెట్ విరాజిల్లుతున్నది. సికింద్రాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది కొనుగోళ్ల కోసం ఇక్కడికి వస్తుంటారు. తాజా కూరగాయలతో పాటు అనేక రకాల నిత్యవసర సరుకులు, పండ్లు హోల్‌సేల్ ధరల్లో ఇక్కడ లభిస్తాయి. దీంతో ప్రజలు పెద్దెత్తున మోండా మార్కెట్‌కు తరలి వస్తుంటారు.
కళ తప్పిన మార్కెట్..
ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 శాతం కూడా ఇక్కడ వ్యాపారం సాగడం లేదు. కరోనా భయంతో అనేకమంది వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. దీంతో మోండా మార్కెట్ చాలా వరకు కళతప్పినట్లయింది. చిరు వ్యాపారులు ప్రతి రోజు వ్యాపార నిర్వహణకు ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకుంటారు. సాయంత్రం అమ్మకాలు అయిపోగానే తిరిగి చెల్లిస్తారు. కరోనా పుణ్యమా అని అమ్మకాలు లేక తీసుకున్న ఫైనాన్స్ తిరిగి చెల్లించలేక అనేక మంది అప్పులపాలవుతున్నారు.
మోండాలో గంపల్లో కూరగాయలు పెట్టుకొని అమ్మకాలు సాగించే చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొనేవారు లేక కూరగాయలను సాయంత్రం చెత్తకుండీల్లో పోస్తున్నారు.
ఇక మార్కెట్‌లో కూరగాయల గంపలు మోసే కూలీలు ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం వరకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరి పాట్లు అన్నీ ఇన్నీ కావు. అదే విధంగా పండ్ల వ్యాపారుల పరిస్ధితి దయనీయంగా ఉంది. తెచ్చిన పండ్లు అమ్ముడుపోక పాడైపోయి నష్టపోతున్నారు. గ్రైన్ మర్చెంట్ పరిస్థితి అధ్వానంగా ఉంది. వ్యాపారాలు లేకపోవడంతో వర్తకులు తమ షాపుల్లో పని చేసే కూలీలను తొలగిస్తున్నారు. మీకు జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో అనేక మంది రోడ్డున పడ్డారు. మార్కెట్‌లో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో అధికారులు మార్కెట్లో రసాయనాలు కూడా పిచికారీ చేయించడం లేదని పలువురు వాపోతున్నారు.
పరిస్థితి దయనీయంగా ఉంది
కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్ధితి దారుణంగా ఉంది. గంపల్లో కూరగాయలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న మేము గిరాకీలు లేక తెచి్చన వస్తువులు అమ్మకాలు కాక ఫైనాన్స్ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాము.
–రాజు, కూరగాయల వ్యాపారి
అమ్మకాలు బాగా తగ్గాయి
ఆకుకూరల అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రజలు బయటకు రావడం లేదు. కరోనా వల్ల 30 శాతం కూడా వ్యాపారాలు సాగడం లేదు. పెట్టిన పెట్టుబడి రావడం లేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
–లక్ష్మణ్,ఆకుకూరల వ్యాపారి
ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు
కరోనా నేపధ్యంలో ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోవాలి. వ్యాపారాలు లేని పరిస్ధితి ఎన్నడూ చూడలేదు. గతంలో ఉల్లిగడ్డల కోసం జనం ఎగబడేవారు. కరోనా పుణ్యమా అని అసలు గిరాకీ లేకుండా పొయింది.
–ధన్‌రాజ్, ఉల్లిగడ్డల వ్యాపారి