
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (CIA)-చర్లపల్లి నోటిఫైడ్ మునిసిపల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ (CNMIASS) సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ (బుధవారం) సాయంత్రం ‘‘ప్రోగ్రెసివ్ డిఫెన్సె ఇండస్ట్రీ-ప్రోగ్రెస్ అఫ్ డిఫెన్సె ఇండస్ట్రీ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ హైదరాబాద్” అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత ప్రాముఖ్యత గురించి వివరించారు. స్వదేశీ రక్షణ రంగ బలోపేతం ద్వారానే దేశ భద్రత, సాంకేతిక స్వావలంబన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాన్ని స్మరించుకుంటూ, తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమల పాత్రను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఐఏ అధ్యక్షులు డీఎస్ రెడ్డి, సీఎన్‌ఎంఐఏఎస్‌ఎస్ ఛైర్మన్ డా.కే గోవిందరెడ్డి, ప్రొఫెసర్ డా. కాశిరెడ్డి వెంకటరెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.