సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి
పట్టణాభివృద్ధికి ‘మెగా’ నిర్ణయాలు
మెగా గ్రోత్ కారిడార్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ కేంద్రంగా అభివృద్ధికి బాటలు వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎయిర్‌పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈవీలే లీజుకు తీసుకోవాలి..
ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణ కేంద్రంగా డెవలప్‌మెంట్ ప్లానింగ్ ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
టెంపుల్ కారిడార్..
నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్‌లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
– వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడాడ్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకం అని సీఎం అన్నారు. ఎయిర్‌పోర్ట్ రాకతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


