జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ
మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం
మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లపై నివేదిక సీబీఐకి అప్పగించాలని తీర్మానం
భూముల మార్కెట్ ధరలు,రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
26వ తేదీలోగా కొత్త ధరలు,చార్జీలు ఖరారు చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా..వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. జస్టిస్ లోకూర్ నివేదికను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించింది. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 9 నెలల క్రితం సీబీఐ విచారణను కోరిన రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా విద్యుత్ రంగ నిర్ణయాలపై సైతం సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం గమనార్హం. మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు.
కొనుగోళ్లు, నిర్మాణం పేరిట నిధుల దుర్వినియోగం
‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అలాగే 4000 మెగావాట్ల యాదాద్రి, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే ఏడాది జూలైలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు.
ఆయన స్థానంలో జస్టిస్ లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి 114 పేజీల నివేదికను సమర్పించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. కాగా నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు..’ అని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
ఆదాయ వనరుల నివేదికపై చర్చ
‘ఆదాయ వనరుల సమీకరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి 4 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యం సిఫారసుల మేరకు శాస్త్రీయ విధానంలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీలోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి కొత్త ధరలు, చార్జీలను ప్రకటించాలని అధికారులను ఆదేశించింది.
పరిహారం రేట్లపై అసంతృప్తి
వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తి ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల పరిహారం ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరించనున్నాయి.
హిల్ట్ పీ దరఖాస్తుదారులకు అవకాశం
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేలోపు హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ) కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించేలా వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి..’ అని మంత్రి చెప్పారు.
ఎన్డీడీబీకి నార్మాక్
‘నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల సహకార సంస్థ (నార్మాక్)ను నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంఓయూను ఆమోదించింది.
– యాసంగిలో పండిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరూ అభద్రతకు లోనుకావద్దని సూచించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంట నష్టం అంచనాలను తెప్పించాలని ఆదేశించింది.
– 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
బకాయిల వసూళ్లకు ఓటీఎస్
– క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడిన పన్నుల వసూళ్లకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5,864 కోట్ల బకాయిలుండగా.. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి ఓటీఎస్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ జల మండలికి ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉన్న నీటి బకాయిలపై వడ్డీలు, జరిమానాలు రద్దు చేయాలని నిర్ణయించింది.
– రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో అధునాత కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు గాను 42 ఎకరాలను అప్పగించాలని తీర్మానించింది.
‘స్కిల్స్’ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు
– రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్‌లు, టీ శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.
– ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది..’ అని పొంగులేటి తెలిపారు.


