భారీ వ‌ర్షాలు..కార్లు ఒక‌దానిపై ఒక‌టి

Cars Float, Swept Away As Hyderabad Faces Deluge video viral - Sakshi

సాక్షి, హైదరాబాద్ : గ‌త మూడు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో భాగ్య‌న‌గ‌రం అల్లాడుతోంది. నాలాలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి.  ప‌లు కాల‌నీలు జ‌ల దిగ్భంధంలోనే ఉన్నాయి. వ‌ర‌ద ఉదృతికి కార్లు స‌హా ప‌లు వాహ‌నాలు కొట్టుకుపోతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కింద పార్క్ చేసిన కారుపైకి  వ‌ర‌ద ప్ర‌వాహానికి మరో కారు వ‌చ్చి చేరింది.  ఇంకో వైపు నుంచి మూడ‌వ కారు కూడా వ‌చ్చి వాటిని ఢీకొట్టిన దృశ్యాలు వ‌ర‌ద భీభ‌త్సానికి అద్దం ప‌డుతోంది. భారీ వాహ‌నాలు సైతం నీళ్ల‌లో తేలుతూ కొట్టుకుపోతున్నాయి. కారులో డ్రైవ‌ర్ లేకున్నా అత్యంత వేగంగా వాహ‌నాలు క‌దులుతూ క‌నిపిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప‌లు అపార్‌మెంట్ సెల్లార్‌లోకి సైతం భారీగా వ‌ర‌ద నీరు రావ‌డంతో వాహ‌నాలన్నీ కొట్టుకుపోతున్నాయి. (పాతబస్తీ: వరద నీటిలో వ్యక్తి గల్లంతు! )

ఎడ‌తెర‌పి లేని వ‌ర్షాల కార‌ణంగా రోడ్ల‌పైకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో జ‌న జీవ‌నం స్తంభించింది.  లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముచెత్తింది. గ‌త 24 గంట‌ల్లో హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో 20 సెం.మీకు పైగానే వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది. తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మ‌రో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ విభాగం వెల్ల‌డించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్‌ 14,15.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అత్య‌వ‌సం అయితే త‌ప్పా ప్ర‌జ‌లు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు తెలిపారు. (వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top