
హైదరాబాద్, సాక్షి: ఇటు సినీ రంగ ప్రముఖులను, అటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను హడలెత్తిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఇవాళ(మార్చి 24, సోమవారం) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటిదాకా 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లందరికీ ఊరట కలిగించే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది.
తాజాగా ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ఓనర్లను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా 19 మందిపై కేసులు నమోదు చేశారు. కొత్త సెక్షన్లు చేర్చి మరీ వీళ్లందరినీ కేసుల్లో నిందితులుగా మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కోర్టులో మెమో సైతం దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖులను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ప్రముఖులకు ఇప్పటికే చాలామంది నోటీసులు పంపించారు. కొందరిని విచారించగా.. మరికొందరిని విచారించాల్సి ఉంది. ఈ క్రమంలో యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం.. ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ప్రమేయం లేకుండా వాటిని ప్రమోట్ చేశామని, పర్యవసనాలకు ఊహించలేదని వివరణలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ లావాదేవీలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఫోకస్ చేసినట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తా. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను
::పంజాగుట్ట పీఎస్‌లో విచారణ అనంతరం శ్యామల
