ఎకరా భూమి..రూ.3.68 లక్షల ఆదాయం

Bee keeping along with date palm as intercrop in guava plantation at Nereducherla - Sakshi

జామ తోటలో అంతర పంటగా ఖర్జూరాతో పాటు తేనెటీగల పెంపకం

లాభాలు గడిస్తూ.. పలువురికి ఉపాధి కల్పిస్తున్న గృహిణి

ఖర్జూర పంట చేతికొస్తే ఆదాయం మూడింతలు పెరుగుతుందంటున్న రాజేశ్వరి

సాక్షి, నల్లగొండ(నేరేడుచర్ల): ఆలోచన ఉంటే ఆదాయ మార్గాలు అనేకం అంటున్నారు.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి శాంతినగర్‌కు చెందిన బాణావత్‌ రాజేశ్వరి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఆదాయం పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఈ సాధారణ గృహిణి. మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈమె భర్త పోలీస్‌ శాఖలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తుండగా కుమారుడు హైదరాబాద్‌లో ఉన్నత విద్య (బీటెక్‌) అభ్యసిస్తున్నాడు. 

కాలక్షేపానికి మల్లెపూల సాగు
రాజేశ్వరి–శ్రీనివాస్‌ దంపతులకు శాంతినగర్‌లో ఉన్న ఖాళీ స్థలంలో కొంత ఇంటి నిర్మాణానికి పోగా ఎకరా భూమి ఉంది. కుమారుడు హైదరాబాద్‌లో చదువుతుండడంతో పాటు భర్త ఉద్యోగానికి వెళ్తుండడంతో రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. కాలక్షేపం కోసం రాజేశ్వరి కొన్నేళ్ల క్రితం తమకున్న ఎకరా భూమిలో మల్లెపూల సాగు చేపట్టింది.

తైవాన్‌ జామతో ఏడాదికి రూ.80వేలు
అయితే, రాజేశ్వరి అనుకున్న మేరకు ఆదాయం రాకపొవడంతో నాలుగేళ్ల క్రితం మల్లెతోటను తొలగించింది. వాటి స్థానంలో బెంగుళూరు నుంచి తైవాన్‌ జామ మొక్కలను తీసుకవచ్చి పెంచారు. జామతోట కాపునకు వచ్చి సంవత్సరానికి రెండు కాపుల్లో 80వేల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది.

అంతరపంటగా ఖర్జూర
కాగా, రాజేశ్వరి ఒక్క జామతోటపైనే ఆధారపడకుండా అంతర పంటగా వివిధ రకాలకు చెందిన 100 వరకు ఖర్జూరా మొక్కలు పెంచుతోంది. వీటిలో బరిహి, ఖనిజా, మెట్‌జోల్, సీసీ, సగాయి. ఆజ్యా, ఆమ్రా వంటి రకాలైన ఖర్జూర మొక్కలను నాలుగేళ్లుగా పెంచుతున్నారు. పంట మరో ఏడాదిలో చేతికి వస్తుంది. మరి కొంతకాలం గడిస్తే వివిధ రకాల ఖర్జూరాలతో ఏడాదికి రూ.5 నుంచి 10లక్షల ఆదాయం వస్తుందని రాజేశ్వరి అంచనా వేస్తున్నారు.

తేనెటీగల పెంపకంతో..
గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కేవీకేలో తెనే టీగల పెంపకంపై రాజేశ్వరి గత ఏడాది శిక్షణ తీసుకున్నారు. అనంతరం జామ, ఖర్జూర తోటలో అంతర పంటగా తేనే టీగల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజేశ్వరీ తన ఆలోచనను భర్త శ్రీనివాస్‌కు తెలియజేసింది. ఆయన రాజేశ్వరీ సహాయ సహకారాలతో పాటు ప్రోత్సాహాన్ని అందించారు. తేనెటీగల పెంపకానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఒక్కోదానికి 15వేల రూపాయలను వెచ్చించి 14 పెట్టెలను తీసుకవచ్చి పెంచుతున్నారు. తేనె టీగలు బయటకు వెళ్లి పూలలోని మకరందాన్ని ఆస్వాధించేందుకు పెట్టెలు కింది భాగంలో కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. పెట్టెలలోని తేనె టీగలను నియంత్రించేందుకు రాణీ ఈగ ఉంటుంది. తేనె టీగలు ఒక్కసారి పెంపకం మొదలు పెడితే ఒక్కో తేనె టీగ  రెండు వేల వరకు గుడ్లు పెడతాయని రాజేశ్వరీ వివరించింది. ఆ గుడ్లు పిల్లలుగా మారి ఎటు వంటి పెట్టుబడి లేకుండా ఫలితాలు ఇస్తాయంటోంది. తేనె టీగల పెంపకం ద్వారా నెలకు 40 కేజీల తేనే ఉత్పత్తి అవుతుందని, కిలో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.ప్రస్తుతం జామపై ఏడాదికి రూ.80 వేల ఆదాయంతో పాటు తేనెపై రూ.24 వేల ఆదాయం వస్తుంది.ఖర్జూర పంట చేతికి వస్తే ఆదాయం మూడింతలకు పైగా పెగుతుందని రాజేశ్వరి పేర్కొంటోంది. 

మంచి లాభాలు గడిస్తున్నా
కాలక్షేపానికి తొలుత మల్లెపూల సాగు చేపట్టా. ఆ తర్వాత జామ, ఖర్జూర, తేనెటీగల పెంపకంతో మంచి లాభాలు గడిస్తున్నా. తాము పెంచుతున్న తేనె టీగల ద్వారా ఉత్పత్తి అవుతున్న తేనెను పరిసర ప్రాంతాల ప్రజలు తోట దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో మార్కెంటింగ్‌ చేయడం కూడా సులువుగా ఉంది. ఖర్జూరా పంట చేతికొస్తే ఆదాయం మూడింతలు పెరగనుంది. 
– బాణావత్‌ రాజేశ్వరి, నేరేడుచర్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top