Amit Shah Contest From Palamuru In 2024 Lok Sabha Election - Sakshi
Sakshi News home page

తెలంగాణపై బీజేపీ పక్కా వ్యూహం? పాలమూరు బరిలో అమిత్‌ షా!

Jan 17 2023 1:11 AM | Updated on Jan 17 2023 3:34 PM

Amit Shah Contest From Palamuru In 2024 Lok Sabha election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో బీజేపీ పట్టుదలతో ఉందా? రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోందా? దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పట్టును పెంచుకోవడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల కైవసం చేసుకునేందుకు వ్యూహం రచించిందా? ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ నుంచి పార్లమెంటు బరిలో దిగనున్నారా? అంటే బీజేపీ కోర్‌గ్రూపు నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. కేంద్రంలో ‘హ్యాట్రిక్‌ సర్కార్‌’ ఏర్పాటుతో రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టు కున్న బీజేపీ.. ఈసారి దక్షిణాది నుంచి కూడా ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది.

ఆ ప్రయత్నాల్లో భాగంగానే పార్టీలో, ప్రభుత్వంలో నంబర్‌ టూ గా ఉన్న అమిత్‌షాను రాష్ట్రం నుంచి పోటీకి దింపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను బట్టి, మహబూబ్‌నగర్‌ పార్టీకి కంచు కోటగా మారిందని అంచనా వేస్తున్న జాతీయ నాయకత్వం.. అమిత్‌షాను ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నెల 8న నగర శివార్లలోని ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆరెస్సెస్, సంఘ్‌పరివార్‌ నేతలతో బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీల ముఖ్యుల భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. గుజరాత్‌తో పాటు తెలంగాణ నుంచి కూడా అమిత్‌షా పోటీచేసి గెలిస్తే ఇక్కడి నుంచే ఎంపీగా (గెలిచాక ఇక్కడి సీటుకు రాజీనామా చేయకుండా) కొనసాగే అవకాశాలు మెండుగానే ఉన్నాయని రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు. 

చిరకాల స్వప్నం సాకారానికి.. 
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో పాటు, అదే ఒరవడిని, విజయపరంపరను కొనసాగిస్తూ రాష్ట్రం నుంచి 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలవడానికి ఈ వ్యూహం ఉపయోగపడుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇక్కడి నుంచి అమిత్‌షా లోక్‌సభకు పోటీ చేయడం వల్ల రాష్ట్రపార్టీ నేతల్లో సీరియస్‌నెస్‌ పెరుగుతుందని, వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ మరింత పెంచేందుకు, నిర్దేశిత రాజకీయ లక్ష్యాల సాధనకు ఇది దోహదపడుతుందనేది పార్టీ వ్యూహమని రాష్ట్ర నేతలు చెబుతున్నారు.

అమిత్‌షా ఇక్కడి నుంచి పోటీచేసే పక్షంలో పలుమార్లు రాష్ట్రానికి వస్తారని, దాని ప్రభావం పార్టీపై, రాష్ట్ర రాజకీయాలపై, ప్రజలపై తప్పకుండా పడుతుందని, పరిస్థితులు పార్టీకి మరింత సానుకూలంగా మారతాయని అంటున్నారు. ఇందులో భాగంగానే అమిత్‌షా ఈ నెల 28న రాష్ట్రానికి వస్తున్నట్టు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 29న కూడా ఇక్కడే బసచేసి పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలోని నాలుగేసి లోక్‌సభ సీట్లను ఒక క్లస్టర్‌గా విభజించి, కనీసం రెండు క్లస్టర్ల నేతలతో అమిత్‌షా భేటీ నిర్వహించే అవకాశాలున్నట్టు తెలిసింది.  

తెలంగాణపైనే ఫుల్‌ ఫోకస్‌ 
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత పార్టీ విస్తరణకు తెలంగాణలోనే అత్యధిక అవకాశాలున్నట్టుగా బీజేపీ అధినాయకత్వం గట్టిగా నమ్ముతోంది. గత ఏడాది, ఏడాదిన్నరగా క్షేత్రస్థాయి నుంచి వివిధ రూపాల్లో పార్టీ, స్వతంత్ర సంస్థలు, బృందాలతో నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలు.. పార్టీకి సానుకూలత పెరిగినట్టుగా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి, వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

అమిత్‌షా, జేపీనడ్డాలు ఇప్పటికే రాష్ట్ర పార్టీని పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎన్నికల సన్నాహాలు పూర్తిగా బీజేపీ అధినాయకత్వం పర్యవేక్షణలోనే సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీకి సంబంధించిన ప్రతి కదలిక, కార్యక్రమాల వంటివన్నీ కూడా మోదీ, అమిత్‌షా, నడ్డా కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు ముఖ్యనేతలు చెబుతున్నారు.

తెలంగాణలో కాషాయజెండా ఎగురవేయడంతో పాటు, జాతీయ స్థాయిలో ప్రయోజనం కలిగించేలా పది నుంచి పన్నెండు దాకా ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నాయకత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా వివిధ రాజకీయ, ఇతర ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement