తిరువొత్తియూరు: నందంబాక్కం ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక, కోటూర్‌పురంలోని ఓ ప్రైవేట్ భరతనాట్య శిక్షణ కేంద్రంలో నృత్యం నేర్చుకుంటోంది. ఆ పాఠశాల నృత్య ఉపాధ్యాయురాలి భర్త, 60 ఏళ్ల ఉమా శంకర్, గత కొంతకాలంగా ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తప్పుడు ఉద్దేశంతో ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఎప్పటిలాగే బాలిక నృత్య తరగతికి వెళ్ళినప్పుడు, ఉమా శంకర్ ఆమె దగ్గరకు వచ్చి ఏకాంతంగా మాట్లాడాలని పిలిచి లైంగికంగా వేధించాడు. దీనితో దిగ్భ్రాంతికి లోనైన బాలిక, ఇంటికి వెళ్లి తన తల్లికి విషయాన్ని వివరించింది. బాలిక తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి. వెంటనే బాలిక తల్లిదండ్రులు కోటూర్‌పురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉమా శంకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై ఊత్తుకోట పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎస్‌ఐ శక్తివేల్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఎస్‌ఐ శక్తివేల్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం, మత్తుపదార్థాలు తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం వుందన్నారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా వుండాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా వుండడానికి పుస్తకాలను చదవడం, క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారులు, వాహనచోదకులు, స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


