తిరువొత్తియూరు: పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారి సహా ముగ్గురి వద్ద రూ.4.25 కోట్ల ఆన్‌లైన్ ద్వారా మోసం చేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు.. తమిళనాడు విద్యుత్ శాఖలో ఉన్నత పదవి నుంచి పదవీ విరమణ పొందిన 70 ఏళ్ల వృద్ధుడు కోయంబత్తూరులో నివసిస్తున్నాడు. అతనితో ఒక పోలీసు అధికారి వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. అప్పుడు, అతనిపై నేరారోపణ వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ చేశామని, బ్యాంకు ఖాతాలోని డబ్బు గురించి విచారణ జరపాల్సి ఉన్నందున, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బు పంపాలని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి పంపుతామని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన పదవీ విరమణ పొందిన అధికారి, తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటి 24 లక్షలను 3 వాయిదాలుగా పంపాడు. డబ్బు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. అదేవిధంగా, కోయంబత్తూరుకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ ఒకరి నుంచి ఆన్‌లైన్ షేర్ పెట్టుబడిలో అధిక లాభం ఇస్తామని చెప్పి రూ.1.85 కోట్లు మోసం చేశారు. మరో పారిశ్రామికవేత్త నుంచి రూ.1.44 కోట్లు దోచుకున్నారు. గత మూడు రోజుల్లో కోయంబత్తూరులో మొత్తం రూ.4.53 కోట్ల మోసం జరిగిందని పోలీసులకు పిర్యాదులు వచ్చాయి. దీనిపై సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు.
సాక్షి, చైన్నె: నిర్మాణ రంగంలోని పని ఒత్తిడిని తగ్గించి, నిపుణుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆర్కాజ్ నేతృత్వంలో ప్రప్రథమంగా చైన్నె పికిల్‌బాల్ కోర్టులో ప్రతిష్టాత్మక క్యూ–లీగ్ 2026 టోర్నమెంట్‌ను నిర్వహించింది. నిర్మాణ రంగ చరిత్రలో ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు , డిజైనర్ల కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. టోర్నమెంట్ విజేతలు, రన్నర్స్‌లకు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్, ది రియల్ ఉమెన్ గ్లోబల్ కమ్యూనిటీ , రోటరీ క్లబ్ ఆఫ్ అన్నా నగర్ ఆదిత్య వంటి ప్రముఖ సంస్థలు మద్దతు తెలిపాయి. ఆర్కాజ్ గ్లోబల్ వ్యవస్థాపకురాలు శిల్పా సుకుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ రంగ నిపుణులకు పికిల్‌బాల్ క్రీడను పరిచయం చేయడం ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు. ఇతరుల కలల ఇళ్లను నిర్మించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యే నిపుణులకు ఈ క్యూ–లీగ్ ఒక గొప్ప ఉపశమనంగా పేర్కొన్నారు.


