దేశంలో వేరే సమస్యలే లేవా..? | - | Sakshi
Sakshi News home page

దేశంలో వేరే సమస్యలే లేవా..?

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

● తిరుప్పరంకుండ్రం కేసులో హైకోర్టు వ్యాఖ్య ● పిటిషనర్‌కు రూ. 50 వేల జరిమానా

సాక్షి, చైన్నె : మదురై తిరుప్పరంకుండ్రం కొండపై హిందూ భక్తులను అనుమతించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సతీష్‌కుమార్‌, జ్యోతి రామన్‌ ధర్మాసనం పిటిషనర్‌కు రూ. 50వేలు జరిమానా విధిస్తూ కేసును కొట్టివేసింది.

పిటిషన్‌లోని వివరాలు

మదురైకి చెందిన కె.కె. రమేష్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ వేశారు. తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించి పూజలు చేయడానికి హిందువులను అధికారులు అనుమతించడం లేదన్నారు. అయితే రంజాన్‌ సమయంలో ముస్లింలను కొండపైకి అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ఇది వివక్షేఅని పేర్కొంటూ, హిందువులకు కూడా అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలి కోరారు.

కోర్టు ఆగ్రహం

ఈ కేసు విచారణకు రాగానే న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో తిరుప్పరంకుండ్రం తప్ప వేరే సమస్యలేమీ లేవా? ఈ ఒక్క అంశంపైనే ఎన్ని కేసులు వేస్తారు? అని ప్రశ్నించారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందుకు తొలుత రూ. 10 లక్షలు ఆలయ ఖాతాలో డిపాజిట్‌ చేస్తేనే విచారణ జరుపుతామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ న్యాయవాదుల వాదన

కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ గోవిందరాజన్‌ వాదిస్తూ.. పిటిషనర్‌ నిరంతరం ఇవే పనులు చేస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వానికి, కోర్టుకు భారీ నష్టం కలుగుతోందన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల ఫీజుల రూపంలో లక్షల రూపాయల ప్రజల డబ్బు వృథా అవుతోందని పేర్కొ న్నారు. ఈదృష్ట్యా, గరిష్ట స్థాయిలో జరిమానా విధించాలని కోరారు. తమిళనాడు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రవీంద్రన్‌ కూడా ఇదే విషయాన్ని సమర్థించారు.

జరిమానా

తొలుత రూ. 5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే పిటిషనర్‌ తరపు న్యాయవాది అంత డబ్బు చెల్లించలేమని, భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్లు వేయబోమని ప్రాధేయపడటంతో జరిమానా మొత్తాన్ని రూ.50వేలకు తగ్గించి న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మతపరమైన సున్నితమైన అంశాలను పదే పదే కోర్టుకు తీసుకొస్తూ, న్యాయవ్యవస్థ సమ యాన్ని వృథా చేసే వారిని కట్టడి చేసేందుకే కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement