తమిళసినిమా: ఆ మధ్య మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సినీ నిర్మాత, వ్యాపారవేత్త జాఫర్ సాధిక్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఆయనతో సంబంధం కలిగిన వారి ఇళ్లను.. మొత్తం చైన్నెలోని 15 ప్రాంతాల్లో ఎన్నికల స్క్వాడ్‌తో కలిసి ఐటీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. జాఫర్ సాధిక్ చైన్నె, ఢిల్లీ నగరాల్లో కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ భారీ ఎత్తున సంపాదించి ఆ సొమ్ము చిత్ర నిర్మాణానికి వెచ్చించినట్లు ఆయనపై అభియోగాలు మోపారు. ఢిల్లీ, చైన్నె పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా చైన్నె ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులతో కలిసి జాఫర్‌సాధిక్‌కు చెందిన ఇళ్లు,కార్యాలయాలు, స్థానిక పురషవాక్కమ్ బ్రిడ్జి సమీపంలోని గెస్ట్ హౌస్ తదితర 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అదే విధంగా జాఫర్ సాధిక్ నిర్మించిన చిత్రంలో నటించిన దర్శకుడు అమీర్ ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ విస్తృతంగా సోదాలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


