– మాజీ అధ్యక్షుడి రాజీనామా
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో డీఎంకేకు కేటాయించిన స్థానాలలో రెబల్స్‌గా పోటీచేస్తున్న నేతలకు కాంగ్రెస్ అధిష్టానం హుకుం జారీ చేసింది. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్న మాజీ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్ ప్రకటించారు. వివరాలు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ డీఎంకే కేటాయించిన 14 స్థానాలలో ఆరు స్థానాలలో (ఒకటి వీసీకే స్థానం) కాంగ్రెస్ తరపున ముఖ్య నేతలు రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. వీరు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో కాంగ్రెస్, డీఎంకే మధ్య ఆరు చోట్ల సమరం నెలకొంది. అదే సమయంలో కూటమి నుంచి సీపీఎం, సీపీఐ, వీసీకేలు బయటకువచ్చి ఒంటరిగా పోటీకి అభ్యర్థులను నిలబెట్టాయి. దీంతో కూటమి చిన్నాభిన్నమైంది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఇండియా కూటమిలో బీటలు నెలకొన్నాయి.అ దేసమయంలో వివాదాన్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. 16 స్థానాలలోపోటీ చేస్తున్నవారే కాంగ్రెస్ అభ్యర్థులు అనిప్రకటించారు. మిగిలిన వారికిమద్దతు ఇవ్వ వద్దు అని పార్టీ వర్గాలకు ఆదేశించారు. అయినారెబల్స్ తగ్గలేదు. దీంతో పుదుచ్చేరి డీ ఎంకే ఎన్నికల ఇన్‌చార్జ్ జగత్ రక్షకన్ ఆగ్రహానికి లోనయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఆ పార్టీ జెండా, చిహ్నాలతో ప్రచారంలో దూసుకెళ్తుండటాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైద్యలింగ్ ప్రకటన చేశారు. రెబల్స్ తప్పుకోకుంటే చర్యలు తప్పదని హెచ్చరించారు. అదే సమయంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రెబల్స్‌గా తానే కాకుండా, తనకుమారుడ్ని రంగంలోకి దించిన మాజీ అధ్యక్షుడు సుబ్రమణియన్ ప్రకటన చేయడం గమనార్హం. ఇక, పుదుచ్చేరిలో తనను పోటీ చేయకుండా అడ్డుకున్నారన్న ఆవేదనలో ఉన్న మాజీ సీఎం నారాయణ స్వామికి అధికారంలోకి రాగానే రాజ్యసభకు పంపించే విధంగా అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా పుదుచ్చేరిలో 9వ తేది ఎన్నికలు జరగనుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇక్కడి 321 పోలింగ్ కేంద్రాలలో భద్రతను పెంచి ఏర్పాట్లు విస్తృతం చేశారు.


