సీటు కోసం గౌతమి, గాయత్రి దరఖాస్తు
సాక్షి,చైన్నె : సినీ నటీమణులు గౌతమి, గాయత్రి రఘురాంలు అన్నాడీఎంకే తరపున ఎన్నికలలో పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. తమకు సీట్లు కేటాయించాలని కోరుతూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 2026 ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 15 నుంచి రాయపేటలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల సందడి హోరెత్తుతోంది. పళణిస్వామి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునే వారు అధికంగా ఉన్నారు. సీనియర్లు, మాజీలు, కొత్త ముఖాలు సైతం ఆశతో దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు. అన్నాడీఎంకేలో సినీ నటీనటులు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు పలువురు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. తాజాగా నటి వింధ్య అన్నాడీఎంకేలో కీలక ప్రచార కర్తగా, అధికార ప్రతినిధిగా ఉన్నారు. తాజాగా బీజేపీ నుంచి నటి గౌతమి ఎన్నికలలో పోటీ చేయడానికి ఇది వరకు ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. దీంతో ఏళ్ల తరబడి తాను కొనసాగిన బీజేపీకి బై బై చెప్పేసి అన్నాడీఎంకేలో చేరారు. అలాగే, బీజేపీలో కీలకంగా ఉన్న నటి గాయత్రి రఘురాం సైతం మాజీ అధ్యక్షుడు అన్నామలైతో వార్ నేపథ్యంలో బయటకు వచ్చేశారు. ఆమె కూడా అన్నాడీఎంకేలో చేరారు. తాజాగా ఈ ఇద్దరు అన్నాడీఎంకే తరపున ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. వీరు తమ దరఖాస్తును అన్నాడీఎంకే అధిష్టానానికి సమర్పించి ఉన్నా రు. నటి గౌతమి తాను విరుదునగర్ జిల్లా రాజపాళయంలో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు. గాయత్రి రఘురాం చైన్నె మైలాపూర్ లేదా తిరుచ్చి శ్రీరంగం నియోజకవర్గాల నుంచి పోటీకి అవకాశం కల్పించాలని విన్నవించుకోవడం విశేషం. అయితే, వీరికి సీటు దక్కేనా అన్నది వేచిచూడాల్సిందే. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఈ తారాలకు పోటీచేసే అవకాశాన్ని పళణిస్వామి కల్పించేనా..? అన్నది వేచిచూడాల్సిందే.


