మరో 115 చోట్ల ఏఐ సిగ్నల్స్
సాక్షి, చైన్నె : చైన్నె నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో కూడిన సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. 115 సిగ్నల్స్‌లో వీటిని ఏర్పాటుకు గ్రేటర్ చైన్నె కమిషనరేట్ నిర్ణయించింది. వివరాలు.. చైన్నె నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పీక్ అవర్స్‌లలో కూడా ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల భరతం పట్టేవిధంగా జరీమాన మోత మోగిస్తున్నారు. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తరహా ప్రత్యేక పరికరం ఆధారంగా తమకు పట్టబడే వారికి జరిమానా విధిస్తూ , తక్షణం రశీదులను అందజేస్తూ వస్తున్నారు. అలాగే నగరంలో నేరగాళ్ల మీద నిఘా వేయడమే కాకుండా, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా చైన్నె చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ నిఘా కెమెరాలు పోలీసులకు మరింత ఉపయోగకరంగా మారి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి నడ్డి విరిచే విధంగా మరో అడుగు ముందుకు ఇటీవల వేశారు. తమ చేతుల నుంచి నిబంధనలు అతిక్రమించే వాళ్లు తప్పించుకున్నా, ఇక ఏఐ నిఘా కెమెరాల నుంచి మాత్రం తప్పించుకోలేని విధంగా చర్యలు చేపట్టారు. కర్ణాటక రాజధాని బెంగళూరు, కేరళ రాజధాని తిరువనంతపురం నగరాలలో వాహన దారుల భరతం పట్టే విధంగా ఏర్పాటు చేసిన ఏఐ నిఘా కెమెరాల పనితీరును పరిశీలించి చైన్నెలో ప్రపథమంగా ఐదుమార్గాలలో అమల్లోకి తీసుకొచ్చారు. ఏఐ టెక్నాలజీతో నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పట్టడం సులభతరంగా ఉండటంతో చైన్నెలో ట్రాఫిక్ రద్దీని కూడళ్లలో అధిగమించేందుకు సైతం ఇదే టెక్నాలజీపై గ్రేటర్ చైన్నె పోలీసుకమిషనరేట్ ఇటీవల దృష్టి పెట్టింది.
ఆటోమేటిక్‌గా అనుమతించేలా..
చైన్నె నగరంలో ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సిగ్నల్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ పోలీసుకు గగనమే. ఇటీవల 50 సిగ్నల్స్‌లో ఏఐ టెక్నాలజీతో కూడిన ఆటోమెటిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ట్రాఫిక్ నియంత్రణ సులభతరంగా ఉండటంతో మరో 115 కూడళ్లలో ఏఐ సిగ్నల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ టెక్నాలజీతో ఒక నిర్ధిష్ట లేన్ ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ కూడలి వద్ద వాహనాలు ఎక్కువసేపు వేచి ఉన్నా, ఒకే మార్గంలో అత్యధికంగా వాహనాలు బారులుతీరి ఉన్నా, ఆ వాహనాలన్నీ ముందుగా వెళ్లే విధంగా ఆటోమెటిక్‌గా సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. అలాగే ఏదేని మార్గం నుంచి తక్కువ వాహనాలు వెళ్తున్నట్టు గుర్తించిన పక్షంలో, తక్షణం ఆ మార్గం వాహన సేవలు నిలుపుదల చేసి, ఇతర రద్దీ మార్గంలోని వాహనాలను ఆటోమెటిక్‌గా అనుమతించే విధంగా ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునే పనిలో నిమగ్నమయ్యారు. చైన్నెలో మొత్తం 165 చోట్ల ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి తొలుత నిర్ణయించారు. తాజాగా 50 చోట్ల సిగ్నల్స్‌లో ఇవి పని చేస్తుండటంతో మరో 115 చోట్ల ఏర్పాటు పనులపై దృష్టి పెట్టారు.


