 
															మత్తు మాత్రల కేసులో నైజీరియన్ అరెస్టు
తిరువళ్లూరు: మత్తు మాత్రలు తరలించిన నైజీరియాకు చెందిన వ్యక్తిని మనవాలనగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి, గుట్కా, మత్తుమాత్రలు జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఎస్పీ వివేకానందశుక్లా ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మనవాలనగర్ ప్రాంతంలో ఇన్‌స్పెక్టర్ ఫరూక్ నేతృత్వంలో పోలీసులు తనీఖీ చేస్తున్న సమయంలో అనుమానస్పదంగా వెళ్తున్న బుల్లెట్ వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. వాహనంలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మత్తు మాత్రలు ఉన్నట్టు నిర్ధారించి, అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నైజీరియాకు చెందిన మైఖేల్‌నంబిగా గుర్తించారు. ఇతను తిరుపూర్‌లోని గార్మెంట్స్‌లో దుస్తులను కొనుగోలు చేసి నైజీరియాకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఇతను చైన్నెలో మత్తుమాత్రలను కొనుగోలు చేసి, యువతే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. మత్తుమాత్రలను తిరువళ్లూరులో విక్రయించడానికి తీసుకొస్తున్న సమయంలో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
