 
															అటవీ గ్రామాల ప్రజలకు ఆపన్న హస్తం
సాక్షి, చైన్నె: నీలగిరి జిల్లాలోని కోతగిరి, గూడలూరు అటవీ గ్రామాల ప్రజలకు సాయం అందించే విధంగా సీక్ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించింది. ఇక్కడి ప్రజలు తక్షణ వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా అంబులెన్స్‌లను, రవాణా సేవలకు లోడ్ వ్యాన్‌ను సిద్ధం చేసి అందజేశారు. రూ. 50 లక్షలతో కూడిన ఈ వాహనాలతో పాటుగా వారి జీవితాలలో వెలుగు నింపే విధంగా కుట్టు మిషన్లు తదితర వాటిని అందజేశారు.సెయింట్ బ్రిట్టోస్ అకాడమీ విద్యార్థులు రోజుకు ఒక్క రూపాయి చొప్పున స్వచ్ఛందంగా కూడబెట్టిన మొత్తంతో పాటూ తాము సమకూర్చిన నిధులతో వీటిని కొనుగోలు చేసినట్టు సీక్ ఫౌండేషన్‌వ్యవస్థాపకురాలు డాక్టర్ విమలా బ్రిట్టో తెలిపారు. గురువారం కోతగిరి, గూడలూరు ప్రాంతాలలోని పెద్దలకు ఈ వాహనాలకు సంబంధించిన తాళాలను అప్పగించారు. కుట్టుమిషన్లు, ఇతర వస్తువులను అందజేశారు. నీలగిరి గిరిజన సంక్షేమ సంఘం కార్యదర్శి అల్వాస్, సీక్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ థామస్ పొన్‌రాజ్ పాల్గొన్నారు. కాగా, గూడలూరులో గిరిజన కుటుంబాలకు 20 ఇళ్ల నిర్మాణానికి ఈ సందర్భంగా తోడ్పాటు అందించారు. అటవీ ప్రాంతాల్లోని ప్రజల అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్‌లను, ఇతర సేవల నిమిత్తం లోడ్ వ్యాన్‌ను ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
