
ఆత్మహత్యల నియంత్రణపై అవగాహన సదస్సు
వేలూరు: విద్యార్థినులు ఆత్మహత్యల నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని తమిళనాడు సైన్స్ మూవ్‌మెంట్ జిల్లా కార్యదర్శి, కాట్పాడి జూనియర్ రెడ్‌క్రాస్ కార్యదర్శి జనార్ధనన్ అన్నారు. వేలూరులోని డీకేఎం మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం, తమిళనాడు సైన్స్ ఉద్యమం, వేలూరు హెల్పింగ్ హార్ట్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ వారంలో భాగంగా అండర్ స్టాండింగ్ యంగ్ హార్ట్స్ అనే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని గత 2003వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఇంటర్నేషణల్‌సొసైటీ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ ద్వారా స్థాపించబడిందన్నారు. విద్యార్థినులు క్షణికావేశంతో వచ్చిన కోపాలతో నిరుత్సాహం చెందకుండా నిర్భయంగా ఉండాలన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులకు వీడియో క్లిపింగ్, ముగ్గుల పోటీలు, పెయింటింగ్, పెన్షల్ డ్రాయింగ్, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి మణినాదన్, ప్రిన్సిపాల్ డాక్టర్ భానుమతి, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ డాక్టర్ సుబైదా సుల్తానా, అన్బు ఉల్లంగల్ ఆర్గగనైజేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, మహిళా న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు జమున, కళాశాల ప్రొఫెసర్ శశికళ తదితరులు పాల్గొన్నారు.