
18న తెరపైకి యూదుమ్ అరియన్
తమిళసినిమా: పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం యాదుమ్ అరియాన్. బ్రేకింగ్ పాయింట్ పిక్చర్స్ పతాకంపై ఎం.గోపీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా దినేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రముఖ కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈయన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం యాదుమ్ అరియాన్. నటి ప్రణా నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎల్ టి.ఛాయాగ్రహణం, ధర్మ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎం.గోపీ మీడియాతో మాట్లాడుతూ ఇది సైకో, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర కథ 2024లో ప్రారంభం అయ్యి 2026లో ముగిసేలా ఉంటుందన్నారు. చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందుతోందని చెప్పారు. చిత్రంలో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అయినట్లు చూపించడం గురించి వివరిస్తూ తాను విజయ్ అభిమానిని పేర్కొన్నారు. ఆయనతో ఒక్క చిత్రం అయినా చేయకపోతానా అని ఎదురు చూస్తున్న తరుణంలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించి సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు జరుగుతున్న ప్రచారం తనను తీవ్ర ద్విగ్భ్రాంతికి గురి చేసిందన్నారు దీంతో ఆయన ముఖ్యమంత్రి అయినట్లు సన్నివేశాలను పొందుపరచే అవకాశం ఈ చిత్రంలో కలగడంతో ఆ సన్నివేశాలను చేర్చినట్లు చెప్పారు. అంతే గాని రాజకీయాలకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం 15 రోజుల పాటు రేయింబవళ్లు షూటింగ్ చేసి శ్రమించినట్లు నటుడు దినేష్ చెప్పారు. తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టిన ఈ చిత్రంలో దర్శకుడు చెప్పినట్లు నటించినట్లు ఆయన పేర్కొన్నారు.