
విజయ్, తిరుమాకు గాలం
● డిప్యూటీ పదవికి అన్నాడీఎంకే నిర్ణయం ● సన్నిహితుల ద్వారా పళణి రాయబారం
సాక్షి, చైన్నె: అధికార పగ్గాలు ఎలాగైనా చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. విజయ్, తిరుమావళవన్ తమ వైపుగా వస్తే చాలు అన్నట్టుగా గెలుపు ధీమాతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వర్గాలు ఉన్నాయి. విజయ్, తిరుమా ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే దిశగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. 2026లో అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. డీఎంకే కూటమి ప్రస్తుతం బలంగా ఉన్నా, ఆ కూటమి పార్టీలో అధిక సీట్ల నినాదం అందుకోవడం అన్నాడీఎంకే నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ సారి అధికారం చేజారిన పక్షంలో మరలా అన్నాడీఎంకే అధికారంలోకి రావడం అసాధ్యమవుతుందన్న నిర్ణయానికి వచ్చిన పళణి స్వామి కొత్త వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో తమ నేతృత్వంలోనే ఎన్నికల వ్యవహారాలు సాగే దిశగా పళణిస్వామి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఆదిశగా తమ కూటమిలోకి విజయ్ తమిళగ వెట్రికళగం, వీసీకే తిరుమావళవన్‌ను ఆహ్వానించే దిశగా కసరత్తులు చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది.
డిప్యూటీ పదవులు..
జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ అన్న విషయాన్ని ఆ పార్టీ పెద్దలకు పళణి స్వామి స్పష్టం చేసినట్టు సమాచారం. అదే సమయంలో తాము కొన్నికీలక పార్టీలను తమిళనాట ఆహ్వానించ బోతున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా వ్యూహాలకు మద్దతు ఇవ్వాలన్న విజ్ఞప్తిని బీజేపీ ఢిల్లీ పెద్దలకు పళణిస్వామి సంకేతాలు పంపినట్టు సమాచారం. ఇందులో తమిళగ వెట్రి కళగం నేతవిజయ్, డీఎంకే కూటమిలోని వీసీకే నేత తిరుమావళవన్ తమ వైపుగా వస్తే గెలుపు తథ్యమన్న ధీమాతో పళని స్వామి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. డీఎంకే కూటమిలో గత కొన్నేళ్లుగా వీసీకే కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంగా అధిక సీట్లు అన్న నినాదాంతో కూటమిలోని ఇతర పార్టీలను రెచ్చగొట్టడం డీఎంకేకు మింగుడు పడడం లేదు. ఈ దృష్ట్యా, ఈసారి ఎన్నికల సమయంలో వీసీకేను పక్కన పె ట్టవచ్చు అన్న చర్చల నేపథ్యంలో ఆ పార్టీ నేత తిరుమావళవన్‌ను తమ వలలో వేసుకునేందుకు డిప్యూటీ సీఎం పదవి ఆశ చూపించే పనిలో అన్నాడీఎంకే ఉన్నట్టు సమాచారం. ఇక, పార్టీ ఆవిర్భావంతో ప్రజలలోకి పూర్తిస్థాయిలో చొచ్చుకెళ్లనప్పటికీ, మద్దతు, అభిమాన బలం ఉన్న నేతగా ఉన్న విజయ్‌ను ఈ సారి తమ వైపు తిప్పుకుంటూ మరింతగా ఓటు బ్యాంక్ దక్కినట్టే అన్న ధీమాతో పళని ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయ్‌ను సైతం డిప్యూటీ సీఎం పదవి ద్వారా తమ వైపుగాతిప్పుకుంటూ అధికారం చేజిక్కించుకున్నట్టే అన్న సంకేతాలతో సన్నిహితుల ద్వారా రాయబార ప్రయత్నాలను అన్నాడీఎంకే వర్గాలు విస్తృతం చేసినట్టుగా ఆదివారం తమిళనాట మీడియాలలో సమాచారాలు హల్ చేయడం గమనార్హం. ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తాయో అన్నది ఎన్నికల నగారా మోగే వరకు వేచిచూడాల్సిందే.