చెరువులోకి వ్యర్థాల విడుదలపై చర్చల విఫలం
పళ్లిపట్టు: టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి గ్రామీణులు, పార్కు నిర్వాహకుల మధ్య తహసీల్దారు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. పళ్లిపట్టు సమీపంలోని నెడియం పంచాయతీలోని వెంగంపేట వద్ద ప్రయివేటు టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. టెక్స్‌టైల్ పార్కు నుంచి విడుదలయ్యే నూలు రంగుతో పాటూ రసాయనం కలిసిన నీటితో భూగర్భజలాలు అడుగంటి గ్రామీణులకు ప్రధాన నీటి వనరుగా ఉన్న చెరువు కలుషితమవుతుందని గ్రామీణులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నీరాహారదీక్ష చేపట్టారు. వారితో పోలీసులు చర్చలు జరిపి చర్చలు ఏర్పాటు చేశారు. తహసీల్దారు కార్యాలయం వేదికగా గ్రామస్తులు, టెక్స్‌టైల్ పార్కు బృందం సభ్యులతో చర్చలు శనివారం సాగాయి. తహసీల్దార్ భారతి ఆధ్వర్యంలో గ్రామీణుల కమిటీ నుంచి రాజేంద్రప్రసాద్, టెక్స్‌టైల్ పార్కు కమిటీ నుంచి రామకృష్ణన్ బృందం పాల్గొన్నారు. గంటపాటు చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు నీటితో చెరువులో ఎలాంటి కాలుష్యం ఏర్పడడం లేదని పార్కు నిర్వాహకులు తెలపగా, గ్రామస్తులు దీన్ని ఖండించారు. రెండు వర్గాల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో తహసీల్దారు సమావేశాన్ని ముగించారు. చర్చలు పట్ల కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన తరువాత కలెక్టర్ తుది నిర్ణయం తీసకుంటారని తహసీల్దారు ప్రకటించారు.


