
బాల్యవివాహం కేసులో యువకుడి అరెస్టు
తిరువళ్లూరు: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న యు వకుడ్ని మప్పేడులో అస్సాం పోలీసులు అరెస్టు చేసి, అతడి చేతులకు తాడు కట్టి అర్థరాత్రి మహిళ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చిన సంఘటన కలకలం రేపింది. అస్సాం రాష్ట్రం నాగోన్ జిల్లాకు చెందిన అజుజూల్ బక్కస్ అలియాస్ బబ్లూ(23) తిరువళ్లూరు జిల్లా మప్పేడు ప్రాంతంలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బబ్లూ తన స్వగ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమించి, వివాహం చేసుకుని మప్పేడుకు వచ్చి తలదాచుకున్నట్టు తెలుస్తుంది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు కేసు నమోదు చేసి, అతడి సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా మప్పేడుకు వచ్చి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ప్రత్యేక వాహనంలో ఉంచిన అస్సాం పోలీసులు, యువకుడ్ని తాడుతో చే తులు కట్టేసి, వాహనం నుంచి తిరువళ్లూరు మహిళ పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారు. యువకుడిని స్థానిక కోర్టులో హాజరు పరిచి అస్సాంకు తరలించారు.