
ధనుష్, వెట్రిమారన్ కాంబోలో మరోచిత్రం
తమిళసినిమా: నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్‌లది సూపర్‌హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం, వడచెన్న, అసురన్ మొదలగు సక్సెస్‌పుల్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. కాగా తాజాగా మరో చిత్రానికి ఈ కాంబో సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం నటుడు సూర్య హీరోగా వాడివాసల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. జల్లికట్టు క్రీడ నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. దీని తరువాత ధనుష్ హీరోగా నటించే చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇది వడచైన్నెకి సీక్వెల్‌నా లేక వేరే కథా చిత్రమా అన్నది వేచి చూడాలి. విశేషం ఏమిటంటే ఈయన ఇప్పటికే ధనుష్ హీరోగా రెండు చిత్రాలను నిర్మించనున్నారు. అందులో ఒక చిత్రానికి విఘ్నేశ్ రాజా, మరో చిత్రానికి మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. కాగా నటుడు ధనుష్ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థలో మూడు చిత్రాలు కమిట్ అయ్యారన్నమాట. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాఽశం ఉంది.