ఫలించని చికిత్స.. ఏనుగు మృతి | - | Sakshi
Sakshi News home page

ఫలించని చికిత్స.. ఏనుగు మృతి

May 21 2025 1:35 AM | Updated on May 21 2025 1:35 AM

ఫలించని చికిత్స.. ఏనుగు మృతి

ఫలించని చికిత్స.. ఏనుగు మృతి

సేలం: చికిత్స ఫలించక ఏనుగు మృతి చెందింది. తల్లి ఏనుగు మరణించడంతో గున్నఏనుగు తల్లఢిల్లింది. ఆ గున్న ఏనుగును అటవీ అధికారులు తమ సంరక్షణలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. కోయంబత్తూరు సమీపంలోని మరుదమలై అటవీప్రాంతంలో శనివారం ఓ ఆడ ఏనుగు కదల లేని స్థితిలో పడి ఉండడం, దాని చుట్టూ గున్నఏనుగు తిరుగుతూ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులు, వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఆ తల్లి ఏనుగుకు చికిత్సలు అందించే ప్రయత్నం చేశారు. తన తల్లికి ఏమైందో తెలియక ఆందోళనతో ఆ పిల్ల ఏనుగు అటు ఇటు తిరుగుతూ తీవ్రవిషాదంతో కనిపించింది. తన తల్లి వద్దకు వైద్యులు, అటవీ అధికారులు వెళ్లే ప్రయత్నం చేయగా, అడ్డుకునేపనిలో పడింది. చివరకు ఆ పిల్ల ఏనుగును అటవీ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తల్లి ఏనుగు లేవ లేని స్థితిలో ఉండడంతో క్రేన్ల సాయంతో నిలబెట్టి వైద్య చికిత్సలు అందించారు. తల్లి ఏనుగును రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. మంగళవారం ఆ తల్లి ఏనుగు మరణించింది. జీవచ్చవంగా పడి ఉన్న తల్లి ఏనుగును చూసి ఆ పిల్ల ఏనుగు పడిన మదన వేదన అక్కడున్న వారిని కలిచి వేసింది. ఆ ఏనుగును వైద్యులు అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పోయారు. మూడు రోజులుగా ఆహారంతో పాటు మందులు ,మాత్రలు అన్ని ఇచ్చినా, ఆ ఏనుగు ఆరోగ్యం కుదుట పడ లేదని, తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఏనుగు కళేబరానికి అంత్యక్రియలు జరిపే పనిలో అటవీ అధికారులు పడ్డారు. అలాగే ఆ పిల్ల ఏనుగును తమ సంరక్షణలో ఉంచుకున్నారు. తదుపరి ఏనుగుల మందలోకి ఆ పిల్ల ఏనుగును పంపించడమా..? లేదా మరెదేని ప్రత్యామ్నాయం అన్నది ఉందా..? అని పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement