
ఆక్రమ ఇళ్ల తొలగింపు
కొరుక్కుపేట: అడయార్ నదిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించారు. సాయుధ పోలీసులు మోహరింపుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పల్లవరం పక్కనే ఉన్న అనకాపుత్తూరులో అడయార్ నది ఉంది. ఈ నదీ తీరంలో క్వాయిడ్–ఎ–అజంమిల్లత్ నగర్, శాంతి నగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ అడయార్ నది ఒడ్డున ఉన్న పరీవాహక ప్రాంతంలో స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. మొదటి దశలో 81 కుటుంబాలను ఖాళీ చేయించి, తమిళనాడు హౌసింగ్ బోర్డు రూ.100 కోట్లతో నిర్మించిన అపార్ట్‌మెంట్లలో ఇళ్లు ఇచ్చారు. చైన్నె పెరుంబాక్కం, గూడూవాంచేరి, కీరప్పక్కం, కిష్కింధ సెల్లం రోడ్ ప్రాంతాల్లో రూ.30 లక్షలు విలువచేసే గృహాలను అందించారు. ఈ పరిస్థితిలో ఈ నెల 12వ తేదీన రెవెన్యూ శాఖ అధికారులకు మిగిలిన ఆక్రమణల గురించి సమాచారం అందించారు. ఆ ప్రాంతం నుంచి వంద మందికి పైగా ప్రజలు గుమిగూడి, చేతుల్లో బ్యానర్లు పట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. దీంతో అధికారులు ఆక్రమణ తొలగింపు పనిని వదిలేశారు. ఈ పరిస్థితిలో మంగళవారం ఉదయం చెంగల్పట్టు కలెక్టర్ అరుణ అధ్యక్షతన మళ్లీ రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనకాపుత్తూర్ అడయార్ నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను తొలగించడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం వంద మందికి పైగా సాయుధ పోలీసు అధికారులు ముందుగానే మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తరువాత, అధికారులు ప్రజలతో నిర్వహించిన చర్చలో 20 కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వం కేటాయించిన అపార్ట్‌మెంట్లలోకి మారడానికి అంగీకరించాయి. తరువాత, అధికారులు ప్రొకై ్లయిన్‌తో ఇళ్లను తొలిగించారు.