
పార్థసారథి స్వామి సన్నిధిలో రోజంతా అన్నదానం
● పథకాన్ని ప్రారంభించిన ఉదయనిధి
సాక్షి, చైన్నె: చైన్నె ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి ఆలయంలో శనివారాలలో రోజంతా అన్నదానం పథకాన్ని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇక, మీదట ప్రతి శనివారం ఇక్కడ రోజంతా ఆహారం, ప్రసాదం అందించనున్నారు. తమిళనాడులోని ఆలయాలను సందర్శించే భక్తుల కోసం అన్నదాన పథకాన్ని ప్రభుత్వం విస్తృతం చేస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్య రోజులలో, పండుగ సందర్భాలు, ఉత్సవాల సమయంలో అయితే, రోజంతా ఆహారం పంపిణీ చేయబడుతున్నది. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, పళణి దండాయుధ పాణి ఆలయంతో పాటుగా పలు ఆలయాలలో రోజంతా అన్నదానాలు చేస్తూ వస్తున్నారు. అన్నదానధర్మాలు జరుగుతాయి, చైన్నె ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి ఆలయంలో మధ్యాహ్నం వేళలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది.
అయితే, ఈ పథకాన్ని విస్తరించే విధంగా శనివారాలు, పండుగ రోజులు, ముఖ్య రోజులు, ఉత్సవాల సమయంలో ఇక రోజంతా అన్నదానం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఆలయంలో రోజంతా అన్నదానం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ భక్తులతో కలిసి భోజనం చేశారు. పార్థసారథి స్వామి ఆలయంలో జరిగిన ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశిలతో పాటూ శనివారాలలో మొత్తంగా 82రోజుల పాటుగా రోజంతా ఆహారంతో వడ, పాయసం అందించనున్నారు. ఆలయాన్ని సందర్శించే 82,000 మంది భక్తులకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ మతం, ధార్మిక శాఖమంత్రి పి.కె. శేఖర్ బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్, ఆర్. ప్రియ, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎన్. చిట్టరసు, ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు ఎస్. మదన్మోహన్, పర్యాటకం, సాంస్కృతిక విభాగం అధికారి డాక్టర్ కె. మణివాసన్, దేవాదాయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్ డాక్టర్ సి. పళని పాల్గొన్నారు.