
విద్యతోనే ఉన్నత శిఖరాలకు..
వేలూరు: విద్యతోనే ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్లస్‌టూ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం, అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందనేరిలోని విద్యాశ్రమం పాఠశాలకు చెందిన విద్యార్థిని చారుమతి ప్లస్‌టూలో 600కుగాను 597 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలోను, వేలూరు జిల్లాలోను మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రొత్సహించేందుకు ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతితోపాటు అభినందన సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల విద్యలో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. విద్య అనే ఆయుధంతో ఒక వ్యక్తి ఎంతటి స్థాయికై నా ఎదగగలడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే నందకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బాబు, డీఎంకే పార్టీ యూనియన్ కార్యదర్శి జ్ఞానశేఖరన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.